మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 1,370 గ్రూప్ -3 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదలైంది. ఈ మేరకు గ్రూప్ 3 ఫలితాలను గురువారం టిజిపిఎస్‌సి సభ్యులతో కలిసి చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థులతో ప్రొవిజినల్ నోటిఫికేషన్‌ను టిజిపిఎస్‌సి తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గతేడాది నవంబర్ 17,8 తేదీలలో గ్రూప్-3 ఉద్యోగ నియామక పరీక్ష నిర్వహించగా.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.67లక్షల మంది అభ్యర్థులు రాసిన విషయం తెలిసిందే. గతంలో జనరల్ ర్యాంకింగ్స్, మెరిట్ జాబితాలను విడుదల చేసిన అధికారులు.. వెబ్ ఆప్షన్లు నమోదు అనంతరం అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి తాజాగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లు, ఎంపికైన పోస్టు కోడ్, ప్రాంతం వివరాలను ఈ జాబితాలో పేర్కొన్నారు. మొత్తంగా 1,388 గ్రూప్-3 పోస్టులు ఖాళీగా ఉండగా.. ప్రస్తుతం 1,370 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితాను విడుదల చేశారు. తదుపరి వెరిఫికేషన్ కోసం ఒక పోస్టును భర్తీ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. మరో 17 పోస్టుల ఖాళీలకు సంబంధించిన ఫలితాలు తర్వాత వెల్లడిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.