టారిఫ్ అనే పదం తనకు అత్యంత ఇష్టమైనది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దాన్ని ఉపయోగించే అమెరికాలో 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు రప్పించగలిగామని పేర్కొన్నారు. బుధవారంనాడు జాతినుద్దేశించి ఆయన మాట్లాడారు. కొన్ని దశాబ్దాలుగా అమెరికాపై ఆయా దేశాలు టారిఫ్‌ల భారాన్ని మోపాయని, ఇకపై అలాంటింది చెల్లబోదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను విజయవంతంగా ముగించామని, వలసలను నివారించగలిగామని పేర్కొన్నారు. ప్రెసిడెంట్ గా రెండోటర్మ్ పదవీకాలంలో సాధించిన విజయాలను తన సంవత్సరాంతపు ప్రసంగంలో ఈ సందర్భంగా ట్రంప్ వివరించారు. ప్రెసిడెంట్ గా 11 నెలల క్రితం తాను బాధ్యతలు చేపట్టిన నాటికి అంతటా గందరగోళ పరిస్థితులు ఉన్నాయని, వాటిని తాను పరిష్కరిస్తున్నానని పేర్కొన్నారు. జనవరిలో పదవి చేపట్టిన తర్వాత దేశ సరిహద్దుల భద్రత, రివర్స్ మైగ్రేషన్, ధరలు తగ్గించడం, 8 యుద్ధాలను ముగించడం, పలు దేశాలపై సుంకాలను విధించడం ద్వారా దేశంలోకి బిలియన్ల డాలర్లు తీసుకురావడం, ఉద్యోగాల సృష్టి ప్రారంభించడం, వలసలను అరికట్టడం, వంటి తన అడ్మినిస్ట్రేషన్ లో సాధించిన విజయాల జాబితాను ట్రంప్ చదివారు. తాను అమెరికాను బలోపేతం చేశానని, 8 యుద్ధాలను పరిష్కరించడంతో పాటు, ఇరాన్ అణు ముప్పును నాశనం చేశానని,
గాజాలో యుద్ధాన్ని ముగించానని, 3,000 సంవత్సరాలలో పశ్చిమాసియాలో శాంతిని తెచ్చానని, గాజాలో హమాస్ వద్ద ఉన్న బందీలను విడుదల చేయించానని ట్రంప్ వివరించారు. ట్రంప్ సంస్కరణలను పేర్కొనకపోయినా, భారతదేశం – పాకిస్తాన్, థాయిలాండ్, కంబోడియా, అర్మేనియా- అజర్ బైజాన్, కొసావో- సెర్బియా, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్ట్ -ఇథియోపియా, రువాండా -కాంగోల మధ్య యుద్ధాలను ముగించానని ఆయన ఏడాది పొడవునా ఎన్నో సార్లు ఆయన పదే పదే వాదించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దేశంలోకి వస్తున్న వలసదారులను ఎదుర్కొనడంలో, అమెరికన్ ఉద్యోగాలను కాపాడడంలో, గృహ ఖర్చులను పెంచడంలో తన పాలన విజయవంతమైనదని ఆయన తనను తానే మెచ్చుకున్నారు. గతంలో బైడెన్ పాలనను దుమ్మెత్తి పోశారు. బైడెన్ హయాంలో మిలియన్ల సంఖ్యలో వలసదారులను తీసుకువచ్చి, అమెరికన్ పన్ను చెల్లింపుదారుల నిధులతో కూడిన గృహాలను ఇచ్చాయని ట్రంప్ విమర్శించారు. క్రిస్మస్ కానుకగా దేశానికి చెందిన ప్రతి సైనికుడికి 1776 డాలర్లు నగదు బహుమతి అందించనున్నట్లు ప్రకటించారు. దీన్ని వార్ డివిడెండ్‌గా ట్రంప్ పేర్కొన్నారు.