ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల విచారణలో ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు రవి ఎట్టకేలకు సినిమా పైరసీకి పాల్పడిన విధానాన్ని వెల్లడించాడు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కొత్త సినిమాల పైరసీ ప్రింట్లతో వ్యాపారం చేసినట్లు ఒప్పుకున్నాడు. గురువారం జరిగిన విచారణలో పైరసీకి సంబంధించిన కీలక వివరాలను రవి వెల్లడించాడు. కేవలం సాధా రణ ప్రింట్లే కాకుండా, ఏకంగా క్యూబ్ నెట్‌వర్క్‌ను, శాటిలైట్ లింక్‌ను హ్యాక్ చేసి సినిమాలను హెచ్‌డి ఫార్మాట్‌లో రికార్డు చేసినట్లు తెలి పాడు. ఈ విధంగా పైరసీ చేసిన సినిమాలను అమ్మేందుకు ’హెచ్‌డి హబ్’ పేరుతో ప్రత్యేకంగా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసినట్లు చెప్పాడు. ఈ ఛానల్‌లో పైరసీ లింకులను అప్‌లోడ్ చేసి, ఒక్కో లింక్‌కు 100 నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేసినట్లు స్పష్టం చేశాడు. ముఖ్యంగా ’హిట్-3’, ’కిష్కింద పురి’ సినిమాలను శాటిలైట్ లింక్ ద్వారానే పైరసీ చేసినట్లు అంగీకరించాడు. ఈ నేపథ్యంలో, మూడు వేర్వేరు కేసుల్లో విచారణ నిమిత్తం నాంప ల్లి కోర్టు ఇమ్మడి రవికి 12 రోజుల పోలీస్ కస్టడీకి అనుమ తించింది. కోర్టు ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం చంచల్‌గూడ జైలు నుంచి అతడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. కాగా, ఐ బొమ్మ సూత్రధారి ఇమ్మడి రవిని విదేశాల నుంచి హైదరాబాద్ రాగా ఈ ఏడాది నవంబర్ 14న పోలీసులు కూకట్‌పల్లిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో అదుపులోకి తీసుకున్నారు. పైరసీ ద్వారా రవి దాదాపు రూ. 20 కోట్ల వరకు సంపాదించాడని, ఆ డబ్బుతో ఫ్లాట్లు, స్థలాలు కొనుగోలు చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అతని బ్యాంకు ఖాతాల్లోని రూ. 3.5 కోట్లను ఫ్రీజ్ చేశారు. 2019 నుంచి ఐబొమ్మ, బప్పం టీవీ వంటి 65కి పైగా మిర్రర్ వెబ్‌సైట్ల ద్వారా రవి సుమారు 21,000 సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్యతో ఉన్న గొడవల కారణంగా ఆస్తి లావాదేవీల కోసం రహస్యంగా హైదరాబాద్ వచ్చిన రవిని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అరెస్టు చేశారు.