భారత్ ఒమన్ మధ్య అత్యంత కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) పై సంతకాలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఒమన్ పర్యటన సందర్భంగా ఇక్కడికి రాగానే గురువారం దేశ సర్వం సహాధికార పాలకుడు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్‌తో విస్తృత సాదర చర్చలు జరిపారు. ఈ దశలోనే ఇరుదేశాల మధ్య హద్దులు లేని ఒప్ంపందం ఖరారు అయింది. ప్రపంచ ఆర్థిక రంగ సంక్షోభం దశలో, అమెరికా నుంచి భారీ స్థాయి సుంకాల నేపథ్యంలో భారత్‌కు ఈ ఒప్పందం కీలక ఉపయుక్త అంశం అవుతుందని అధికార వర్గాలు విశ్లేషించాయి. ఇథియోపియా పర్యటన తరువాత ప్రధాని మోడీ బుధవారం రాత్రి ఒమన్ చేరుకున్నారు. మస్కట్‌లోని అల్ బరాకా ప్యాలెస్ వద్ద ప్రధాని మోడీ సుల్తాన్ సాదర స్వాగతం పలికారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ప్రగాఢం చేసుకునేందుకు ఇరువురు నేతల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
భారత్ ఒమన్ మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 70 సంవత్సరాలు అవుతున్న పూర్వ రంగంలోనే సుల్తాన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు భారత ప్రధాని ఒమన్‌కు వెళ్లారు. ఆయన తలపెట్టిన నాలుగు దేశాల పర్యటనలో ఇది చివరి మజిలీ అయింది. ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో అనేక రంగాలపై దృష్టి సారించారు. రక్షణ, భద్రత, వ్యాపార వాణిజ్య , ప్రత్యేకించి పెట్టుబడులు, ఇంధనం, వ్యవసాయం, సాంకేతికత, నూతన రూపు దిద్దుకుంటున్న సృజనాత్మక రంగాలపై కూడా నేతలు చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అంతకుముందు భారత్ ఒమన్ వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, యూసఫ్ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా) కుదిరింది. దీనిపై ఇప్పుడు మోడీ, సుల్తాన్ సమీక్షించారు. ఇది కీలక ఒప్పందం అని అబిప్రాయపడ్డారు. గ్లోబల్ ఆర్థిక సరఫరాల వ్యవస్థ పునరేకీకరణల దశలో ఒమన్‌తో కుదిరిన ఎఫ్‌టిఎ చారిత్రకం అయింది. పైగా ఇంతకు ముందు ఒమన్ వేరే ఒక్కదేశంతోనే ఈ ఒప్పందానికి దిగింది.
భారత్‌కు ఈ విషయంలో రెండవ స్థానం దక్కింది. ఇప్పుడు ఇరుదేశాల పౌరులకు మరిన్ని ఉద్యోగాలు, సముచిత మార్కెట్ అనుసంధానం , వ్యాపార వృద్థికి బాటలు వేసేందుకు ఇప్పటి ఒప్పందాలు దోహదం చేస్తాయని జైస్వాల్ తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం క్రమంలో భారత్ నుంచి ఒమన్‌కు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఖనిజ ఇంధనాలు, రసాయనాలు, విలువైన లోహాలు, స్టీల్, తృణధాన్యాలు, షిప్‌లు, బోట్స్ , బాయిలర్స్ , ఎలక్ట్రిక్ యంత్ర సామాగ్రి , టీ కాఫీ, సుగంధ ద్రవ్యాలు, పగడాలు, పలు ఆహార పదార్థాలు సరఫరా చేసేందుకు వీలేర్పడుతుంది. ఇక విస్తృతమైన భారతీయ మార్కెటను ఒమన్ సద్వినియోగపర్చుకుంటుంది.