గాంధీజీ పేరు తీసేస్తే చరిత్ర మారుతుందా? ఉపాధి హామీ పథకం పేరు మార్పు గాంధీజీని అవమానించినట్లేనని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజం ఎత్తారు. గాంధీజీ పేరును తొలగించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో 2005లో ఆనాటి యూపిఏ ప్రభుత్వం చారిత్రాత్మకమైన ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే గడచిన పది సంవత్సరాల నుంచి బిజెపి ప్రభుత్వం ఆ పథకానికి తూట్లుపొడుస్తూ నీరుగారుస్తోందని ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు. మహాత్మాగాంధీ పేరును తొలగించి, రాష్ట్రాలపై 40 శాతం భారాన్ని నెట్టడం పేదల పొట్ట కొట్టడమేనని ఆయన దుయ్యబట్టారు.
పథకం పేరు మార్చడం వెనుక కేంద్ర పాలకుల సంకుచిత మనస్తత్వం
పార్లమెంట్‌లో తీసుకొచ్చిన ఈ బిల్లు అభివృద్ధి తిరోగమనమేనని, రాష్ట్రాలపై మోయలేని భారమన్నారు. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఇప్పుడు వికసిత్ భారత్ -గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్‌గా మార్చడం అన్యాయమన్నారు. లోక్‌సభలో బలవంతంగా గురువారం ఆమోదించిన ఈ కొత్త బిల్లు, పథకం స్వభావాన్ని, నిధుల సమీకరణను పూర్తిగా మార్చి వేసిందని ఆయన విమర్శించారు. దేశానికి స్వాతంత్య్ర ఫలాలు అందించిన మహానీయుడు,
జాతిపిత మహాత్మాగాంధీ పేరు మీద 20 ఏళ్ల క్రితం యూపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు మార్చడం వెనుక కేంద్ర పాలకుల సంకుచిత మనస్తత్వం కనిపి స్తోందని, పేరు మార్చినంత మాత్రాన వారి వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోలేరన్నారు. వికసిత్ భారత్ అని నినాదాలు ఇస్తూ, గ్రామీణ భారతానికి వెన్నెముకగా ఉన్న పథకాన్ని అగాధంలోకి నెడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, పేదల కడుపు కొడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.