హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించుకున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సిఎం ప్రజాపాలన ఏర్పడి రెండేళ్లు పూర్తైందని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలు సాధించిందని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోను కాంగ్రెస్ ను ఆశీర్విదించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తం 8,335 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ గెలిచిందని, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ 66 శాతం ఓట్లు సాధించిందని పేర్కొన్నారు. బిజెపి, బిఆర్ఎస్ కూటమికి 33 శాతం సీట్లు వచ్చాయని, 94 నియోజక వర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయని, 87 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధించిందని అన్నారు. రాష్ట్రంలో 12 వేలకు పైగా గ్రామపంచాయతీలకు ఎన్నికలు పూర్తి అయ్యాయని తెలిపారు.
బిఆర్ఎస్ 8 నియోజక వర్గాల్లో మాత్రమే మెజార్టీ సాధించిందని, ముథోల్ నియోజక వర్గంలో బిజెపి అధిక స్థానాలు గెలిచిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు 21 నియోజక వర్గాల్లో ఆధిక్యం సాధించామని, రెండు ఉపఎన్నికల్లోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించిందని అన్నారు. పేదలకు తాము అందిస్తున్న సంక్షేమ పథకాలే తమ విజయానికి కారణమని కొనియాడారు. 7,527 గ్రామ పంచాయితీలను కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, 808 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారని, పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమ రెండేళ్ల పాలనపై తీర్పుగా భావిస్తున్నామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో కొనసాగిస్తున్నామని, ఈ ఎన్నికల్లో ఎలాంటి అధికారిక దుర్వినియోగానికి ప్రభుత్వం పాల్పడలేదని అన్నారు. పూర్తిగా స్వేచ్చాయుత, ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండి.. ప్రజలకు చేరువగా ఉండి విజయం సాధించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.