హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ మళ్లీ అధికారంలోకి రావాలనే కోరిక ప్రజల్లో బాగా ఉందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయిన రెండేళ్లలోనే మళ్లీ ప్రజల ఆదరణ పొందుతుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కెటిఆర్ పర్యటన చేశారు. భువనగిరి బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో అభినందన కార్యక్రమం జరిగింది. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను కెటిఆర్ అభినందించారు. ఈ సందర్భంగా భువనగిరి లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 151 సర్పంచ్ స్థానాలను బిఆర్ఎస్ గెలుచుకోవడం విశేషమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం పొందుతుందని, ఎంపిగా గెలవటం కంటే సర్పంచ్ గా గెలవటం కష్టం అని అంటారని.. అది నిజం అని పేర్కొన్నారు. గ్రామాల్లో బిఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని కెటిఆర్ మండిపడ్డారు.