హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అడుగడుగునా కష్టాలు పెడుతోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి పాలనలో రైతులు గోస పెడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా మెదక్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగు నీరు లేకపోవడంతో.. మెదక్ రైతులు అయోమయంలో ఉన్నారని, సాగునీరు ఇవ్వలేకపోతే రైతులకు స్పష్టంగా చెప్పాలని మండిపడ్డారు. రూ. 1800 కోట్ల రైతుల బోనస్ పెండింగ్ లో ఉందని, ఘన పూరం నుంచి యాసంగి పంటకు నీళ్లు ఇస్తారో లేతో క్లారిటీ లేదని హరీష్ రావు విమర్శించారు. గత వేసవిలో ప్రాజెక్టు మరమ్మతులు చేసే అవకాశం ఉన్నా చేయలేదని, ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం రైతులు ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో బోరు బండ్లు లేవని, కాంగ్రెస్ రాగానే మళ్లీ బోరు బండ్లు వచ్చాయని అన్నారు. ఈ రోజు వరకు 40 శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు అంశాల్లో ఫెయిల్ అయ్యిందని హరీష్ రావు పేర్కొన్నారు.