మానవ వలసలు ఒక ప్రమాదకర అంతర్జాతీయ సమస్యగా రోజు రోజుకు ప్రపంచ మానవాళిని వేధిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 2014 నుంచి నేటి వరకు కనీసం 70,000 మంది వలసదారులు తమ ప్రాణాలను కోల్పోయారని లేదా ఆచూకీ తెలియకుండా పోయిందని, వాస్తవానికి ఈ సంఖ్య అనేక రెట్లు అధికంగా ఉండవచ్చని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కొక్క వలసదారుల మరణాలు ఒక్కో కుటుంబానికి తీరని వ్యథను మిగిల్చిందని గమనించాలి. నేడు ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో మానవ వలసలు క్రమంగా పెరగడం రానున్న కాలంలో ఒక భయానక మానవీయ సంక్షోభంగా మారనుందని స్పష్టం చేస్తున్నారు. దేశాల మధ్య యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు, విపత్తులు, వాతావరణ ప్రతికూల మార్పులు, నిరంకుశ పాలనలు, ఆహార అభద్రత, మానవీయ సంక్షోభాలు, ఆర్థిక అసమానతలు లాంటి పలు కారణాలు వలసదారుల సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయి. 2023లో ప్రపంచవ్యాప్తంగా వలసదారుల వేదనలు పెరగడం, వలసల వరదలు పారడం, వలసదారుల కన్నీటి తుపానులు ప్రవహించడం చూశాం.
ఇజ్రాయెల్ – పాలస్తీనా, ఉక్రెయిన్ – రష్యా యుద్ధాలు, బంగ్లాదేశ్‌లో అంతర్గత రాజకీయ సంక్షోభం, ప్రకృతి విపత్తులు, ఆకలి కేకలు వంటి కారణాలతో మానవ వలసల వరదలు పారడం, ఇరుగు పొరుగు దేశాల్లోకి లేదా సురక్షిత ప్రాంతాల్లోకి శరణార్థులుగా చేరడం, యుద్ధాలు లేదా అల్లరులతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఇండ్లు వదిలి వలసదారులు పట్టడం చూశాం. వలసదారుల శ్రమ శక్తి, నైపుణ్య లక్షణాలు, ఆవిష్కరణ ఆలోచనలు, ఔత్సాహిక ప్రవృత్తులు నేటి సమాజానికి ఎంతో ఉపకరిస్తాయని మరువరాదు. వలసదారులతో ఆయా ప్రాంతాల్లో ఆర్థిక ప్రగతి కనిపిస్తుందని, వారికి అవకాశాలు కల్పిస్తే సమాజాభివృద్ధికి కూడా ఎంతగానో దోహదపడతారని తెలుసుకోవాలి. మిలియన్ల కొద్దీ వలసదారుల తమ గృహాలను వదిలి ప్రాణాలు కాపాడుకోవడానికి పిల్లలతో సహా సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటూ ఇతర దేశాలు లేదా ప్రాంతాలకు పరుగులు తీయడాన్ని ఒక అమానవీయ చర్యగా భావించిన ఐరాస సభ్యదేశాలు 2000 నుంచి ప్రతి ఏటా 18 డిసెంబర్ రోజుల అంతర్జాతీయ వలసదారుల దినం లేదా ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
వలసదారులపట్ల మానవ హక్కుల ఉల్లంఘనలకు సమాధానాలు, వారి దయనీయ పేదరికాలు, సమ్మిళిత అభివృద్ధి ఆశయాలు, వలసదారుల పరిరక్షణ పాలసీలు, వారి భద్రత, వారి శాంతి సురక్షలు, మానవీయ హక్కుల కల్పనలు, ఆకలి చావులను అడ్డుకోవడం, గౌరవంగా జీవించే హక్కులను కల్పించడం, స్వేచ్ఛను కలిపించడం, వివక్ష కోరల్లో చిక్కడం, హింసలపాలు కావడం, మానవ అక్రమ రవాణా వలలో చిక్కడం, వారి అభిప్రాయాలు, కన్నీళ్లకు విలువ లేకపోవడం లాంటివి పలు అంశాలను చర్చించి సరైన సమాధానాలు వెతకడానికి ఈ వేదికలు ఉపకరిస్తున్నాయి. అంతర్జాతీయ వలసదారుల దినం- 2025 ఇతివృత్తంగా నా విజయ గాథ: సంస్కృతి, అభివృద్ధి (మై గ్రంట్ స్టోరీ: కల్చర్స్ అండ్ డెవలప్‌మెంట్) అనబడే అంశాన్ని ప్రచారం చేయడం జరుగుతోంది. వలసదారుల శ్రమదోపిడీ ఒక ప్రధాన సమస్యగా మారడం విచారకరం.
తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగం, వ్యవసాయ రంగాలు, వ్యాపారాలు, నైపుణ్య రంగాల్లో బీహార్, యుపి, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు వలసలు రావడం చూస్తున్నాం. నిస్సహాయ పరిస్థితుల్లో కుటుంబాలు లేదా వ్యక్తులు పలు కారణాలతో తమ గృహాలను వదిలి ఇతర దేశాలకు లేదా ప్రాంతాలకు వెళ్లడాన్ని మానవ వలసలుగా పిలుస్తారు. భారత్ లాంటి దేశాల్లో పని, ఆహార భద్రత, పేదరికం లాంటి కారణాలతో పట్టణాలు లేదా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం చూస్తున్నాం. బలవంతంగా అయినా లేదా మరో దారిలేనపుడు వలసలు పెరుగుతున్నాయి. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, పర్యావరణ కారణాలతో భారతదేశంలో వలసలు కనిపిస్తున్నాయి.2011 వివరాల ప్రకారం భారత దేశవ్యాప్తంగా 45.6 కోట్ల మంది ఇతర రాష్ట్రాలు లేదా ప్రాంతాలకు వలసలు వెళ్లారని, వీరిలో 54 శాతం మంది పట్టణాలకు వలసలు వెళ్లినట్లు తెలుస్తున్నది.
యుపి, బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి దాదాపు 88% ఇతర రాష్ట్రాలకు వలసల వరదలు పారడం చూస్తున్నాం. వలసదారుల సమస్య ఫలితంగా పౌరసమాజంపై సానుకూల, ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక, జనాభా పరమైన, సామాజిక, పర్యావరణ కోణాల్లో పలు సమస్యలు లేదా అనుకూల ఫలితాలు గమనించవచ్చు. మానవ హక్కులను కోల్పోవడం, సామాజిక అభద్రత, కనీస అవసరాల కొరత, గౌరవమైనా పని దొరక్కపోవడం, వైద్య ఆరోగ్య అభద్రత, కనీస వేతనాలు దొరక్కపోవడం, మురికివాడల్లో జీవనాలు లాంటి పలు సమస్యలు వలసదారులు వేధిస్తున్నాయి. వలసదారులు మన లాంటి సాధారణ మానవులే అని, వారికి కూడా గౌరవంగా జీవించే హక్కు ఉంటుందని తెలుసుకొని వారిని మన సమాజంలో భాగంగా చూసుకుందాం, మానవీయ విలువలను కాపాడుదాం.
– డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
– ౯౯౪౯౭౦౦౦౩౭
( నేడు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం)