రూపాయి విలువ భారీగా పతనమైంది. అమెరికన్ డాలర్‌తో పోల్చిచూస్తే రూపాయి విలువ చరిత్రాత్మకంగా అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి విలువ తొలిసారిగా అమెరికన్ డాలర్‌కు ప్రతిగా 91 రూపాయల మార్కులు దాటి ముందుకు వెళ్ళింది. డాలర్‌తో పోల్చి చూస్తే రూపాయి విలువ తొలిసారి 91.075 వద్ద ట్రేడ్ అయింది. దీంతో మొదటిసారి రూపాయి విలువ ఒక అమెరికన్ డాలర్‌కు 91 మార్కును టచ్ చేసింది. అయితే గడచిన పది ట్రేడింగ్ సెషన్లలో గమనించినట్లయితే రూపాయి విలువ 90 నుంచి 91 పడిపోయినట్లు గమనించవచ్చు. అంతర్జాతీయ విపణిలో భారతీయ కరెన్సీ విలువ రోజురోజుకూ పడిపోతుంది. గత వారం కూడా భారీగా పడిపోయినా ఆఖరులో పుంజుకోగా, ఇప్పుడు మళ్లీ ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. విదేశీ పెట్టుబడిదారులు భారతీయ స్టాక్స్, బాండ్స్ విక్రయిస్తుండటం, అమెరికాతో ట్రేడ్ డీల్ ఒక కొలిక్కిరాకపోవడం వంటివి కారణంగా కనిపిస్తున్నాయి. వాణిజ్య లోటు పెరగడం అంటే భారత్ ఎక్కువగా ఎగుమతులు చేసే దాని కంటే దిగుమతులే ఎక్కువగా ఉంటాయి.
ఇది డాలర్ డిమాండ్ పెంచి రూపాయిపై ఒత్తిడిని పెంచుతోంది. రూపాయి పతనం అవుతుంటే మనకు దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారతాయి. తద్వారా ధరలు పెరుగుతాయి. ఇది సామాన్యుడిపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత కరెన్సీ రూపాయి అమెరికన్ డాలరుతో పోలిస్తే భారీగా పడిపోతోంది. గత కొంత కాలంగా తగ్గుతూనే ఉన్న మన మారకం విలువ మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే రూ. 90.70 మార్కు దాటి సరికొత్త జీవన కాల కనిష్ఠ స్థాయిని తాకింది. గత వారం కూడా ఒక దశలో 90.50 మార్కు దాటి గురు, శుక్రవారాల్లో కాస్త పుంజుకొని 90 మార్కు దిగువకు చేరింది. దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు రెండూ రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా అమెరికా- భారత్ ట్రేడ్ డీల్ సహా వాణిజ్య లోటు పెరగడం, అంతర్జాతీయ విపణిలో డాలర్ డిమాండ్ పెరగడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్తుండటం వంటివి రూపాయి పతనానికి దారితీస్తున్నాయి. రూపాయి భారీ పతనంతో ఈ ఏడాదిలో ఆసియాలో వరస్ట్ పెర్ఫామర్‌గా రూపాయే ఉండటం గమనార్హం.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూస్తే డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 5.5 శాతం తగ్గింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై దిగుమతి సుంకాల్ని 50 శాతానికి పెంచడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అమెరికా సుంకాల వల్ల మన ఎగుమతులు ప్రభావితం అయ్యాయి. అదే సమయంలో డాలర్ విలువ పెరుగుతుండటం వల్ల దిగుమతులు భారం అవుతున్నాయి. ఈ సుంకాలను తగ్గించుకునేందుకు భారత్-, అమెరికా చాలా కాలంగా చర్చలు కొనసాగిస్తున్నప్పటికీ ఇది ఎప్పుడు కుదురుతుందో ఇప్పటివరకు ఒక స్పష్టత రాలేదు. ఒకవేళ ఒప్పందం కుదిరినా భారత్‌పై సుంకాల్ని తగ్గించేందుకు అమెరికా అంగీకరిస్తుందో లేదో చూడాలి. దీనికి తోడు అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో భారతీయ ఈక్విటీల నుంచి విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నారు. 2025లోనే ఇప్పటివరకు చూస్తే విదేశీ ఇన్వెస్టర్లు 18 బిలియన్ డాలర్లకు పైగా విలువైన భారతీయ స్టాక్స్‌ను అమ్మేశారు. పోర్ట్‌ఫోలియో అవుట్ ఫ్లోస్‌లో ఇదో రికార్డు.
ఒక్క డిసెంబర్ నెలలోనే 500 మిలియన్ డాలర్లకుపైగా విలువైన బాండ్లను విక్రయించారు. విదేశీ పెట్టుబడులు తరలి వెళ్లడం వాణిజ్యపరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలోనే రూపాయి విలువ తగ్గుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలహీనపడుతోంది. కానీ రూపాయి అంతకన్నా ఎక్కువ బలహీనపడటం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా మారింది అని చెప్పవచ్చు. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం కూడా కాస్త ఆందోళన తగ్గించే అవకాశంగా చెప్పవచ్చు. ఎందుకంటే రూపాయి విలువ తగ్గే కొద్దీ చమురు కోసం ఎక్కువ డాలర్లు భారత్ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర తగ్గిన నేపథ్యంలో తక్కువ డాలర్లకే ఆయిల్ లభిస్తుంది. రూపాయి విలువ తగ్గినట్లయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఖర్చు పెరుగుతుంది.
అలాగే భారత్ పలు విదేశీ బ్యాంకుల నుంచి, ఇతర దేశాల నుంచి గనుక అప్పులు తీసుకున్నట్లయితే వాటిపై చెల్లించే వడ్డీ డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. డాలర్లకోసం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి ఉంటుం ది. తద్వారా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ఇది నష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే ట్యూషన్ ఫీజును వారు డాలర్లలో చెల్లించాలి. రూపాయి బలహీనపడితే ఖర్చు పెరుగుతుంది. ఎగుమతుల కంటే దిగుమతులు అధికం కావడంతో వాణిజ్య లోటు పెరగడం కూడా రూపాయి పడిపోవడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఫలితంగా విదేశాల నుంచి దిగుమతి చేసే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. తద్వారా వాణిజ్య లోటు పెరుగుతుంది. వాణిజ్య లోటు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది తీవ్ర నష్టం కలిగిస్తుందని చెప్పవచ్చు.
– ఇస్కా రాజేష్‌బాబు
93973 99298