మన తెలంగాణ/సిటీ బ్యూరో: రాష్ట్ర రాజధాని నగరం గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటిని అందిస్తున్న నగర శివారు జంటజలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ల్లోకి మలమూత్ర వ్యర్థాలు కలుస్తున్నాయి. నగరంలోని భవనాల నుండి తీసేసిన మలమూత్ర వ్య ర్థాలను కొందరు ప్రైవేట్ ట్యాంకర్ల వారు నేరుగా జలాశయాల్లో కలుపుతున్నారు. దీనికి తోడు జలాశయాల పరిధిలోని కాలనీల నుండి మురుగు వ్యర్థాలు నేరుగా వచ్చి చేరుతున్నాయి. జలమండలి పర్యవేక్షణ లోపం కారణంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లలోని కలుషితాలు చేరుతుండటంతో తాగునీరు కాస్త గరళం గా మారుతోంది. మురుగు, వ్యర్థాలు కలువకుండా త గు చర్యలు తీసుకోవాల్సిన జలమండలి మాత్రం అప్పు డో ఇప్పుడో దొరికిన వారిపై కేసులు పెడుతూ చేతులు దులుపుకుంటుందనేది ప్రధాన ఆరోపణ. కలుషితాలు చేరకుండా, వ్యర్థాలను కలపకుండా, తగు చర్యలు తీసుకోవడంలో జలమండలి పూర్తిగా విఫలమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
167 ఎంఎల్‌డీల నీరు..
గ్రేటర్ హైదరాబాద్‌కు జంటజలాశయాల నుండి ని త్యం 167 మిలియన్‌ల లీటర్లను సేకరిస్తున్న జలమండ లి.. ఆ జలాశయాల కాలుష్య కారకాలపై మాత్రం పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నట్టు విమర్శలున్నాయి. ఉస్మాన్ సాగర్ నుండి 106 మిలియన్ లీటర్ల నీరు, హి మాయత్‌సాగర్ నుండి 61 మిలియన్ లీటర్ల నీటిని ప్ర తి రోజు జలమండలి సేకరిస్తుంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్‌లో నిలువగా ఉన్న నీరు 1790.000 అడుగుల తో 3.900 టిఎంసిలుగా ఉంది. హిమాయత్‌సాగర్‌లో ప్రస్తుతం నిలువనున్న నీరు 1763.500 అడుగులతో 2.968 టిఎంసిలుగా ఉన్నది. ఈ నీటిని వచ్చే వేసవి వ రకు జలమండలి ప్రతిరోజు సేకరిస్తూనే ఉంటుంది. వే సవిలో జలాలు అడుగంటితే మాత్రమే నీటి సేకరణను నిలిపేసే పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకు జలాశయాల్లోని నీటిని సంరక్షించాల్సిన బాధ్యత జలమండలిపై ఉంటుందనేది పాలక వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ఈ జలాశయాల్లోకి మురుగు నీరు చేరకుండ, వాటిల్లో వ్య ర్థాలను పారబోయకుండా, వీటి పరివాహక ప్రాంతాల్లో కి నిర్మాణాలు రాకుండా చూడాల్సిన జలమండలి మాత్రం అటువైపు తొంగిచూడటంలేదని, కేవలం నీటిని సేకరించడం వరకే పరిమితమైందని, జలాశయాల పరిరక్షణను గాలికొదిలేసినట్టు విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
నేరుగా..సెప్టిక్ ట్యాంక్‌ల వ్యర్థాలు..
జలమండలి నిర్లక్షం వల్ల కొందరు ప్రైవేట్ ట్యాంకర్ల వారు సెప్టిక్ ట్యాంకర్లలోని నీటిని తీసుకొచ్చి జంటజలాశయాల్లోకి నేరుగా పారబోస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే వారు లేకపోవడంతో వారు ఈ పనికి పూనుకుంటున్నారనేది ప్రచారంలో ఉంది. జలాశయాల చుట్టూ జీఓ.నెం.111 అమలులో ఉన్నది. అయినా, వీటి పరివాహక ప్రాంతాల్లోకి ఫాం హౌస్‌లు, ఫంక్షన్ హాల్స్, గెస్ట్ హౌస్‌లు, అపార్ట్‌మెంట్స్ విపరీతంగా వచ్చి చేరుతున్నాయి. ఫలితంగా వాటి నుండి నిత్యం వెలువడుతున్న మురుగు నేరుగా జలాశయాల్లోకి వచ్చి చేరుతుంది. వీటిపై చర్యలు లేకపోవడంతో వాటి డ్రైనేజీ కాలువలుగా జలాశయాల్లో వచ్చి కలుస్తున్నాయి. పరివాహక ప్రాంతాల్లో వెలువడే మురుగును శుద్ది చేసేందుకు ఎస్‌టిపిలను ఏర్పాటుచేసుకోవాలనిగానీ, వ్యర్థాలను వదులుతున్న నిర్మాణాలపై చర్యలు గానీ జలమండలి తీసుకోకపోవడంతో జలాశయాల్లోకి మురుగు వ్యర్థాలు కలుస్తున్నాయని అక్కడి వాసులు ఉదహరిస్తున్నారు.
క్రిమినల్ కేసులు..
హిమాయత్‌సాగర్ జలాశయంలోకి సెప్టిక్ ట్యాంక్ నీటిని వదులుతున్న ప్రైవేట్ ట్యాంకర్‌ను గుర్తించి, వాహనాన్ని సీజ్ చేసి, ఆ ట్యాంకర్ యజమానిపై, డ్రైవర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయించినట్టు జలమండలి అధికారులు వెల్లడించారు.