పెద్దపల్లి జిల్లా, మంథని నియోజకవర్గం, మంథని మండలం, అడవి సోంపల్లి గ్రామ శివారులో గల మానేరు చెక్ డ్యామ్ కొట్టుకుపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నీరు నిల్వ ఉండడానికి మానేరు నదిపై గత ప్రభుత్వం చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టింది. అయితే, బుధవారం చెక్ డ్యామ్ నీటిలో కొట్టుకుపోయి నీరు దిగువకు పోతుండడంతో స్థానికులు గమనించి ఆందోళన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చెక్ డ్యామ్ వరద నీటికి కొట్టుకపోవడంతో నిధులు పూర్తిగా దుర్వినియోగం అయ్యాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ చెక్ డ్యామ్ నీటి ప్రవాహానికి కొట్టుకపోయిందా లేక గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా ధ్వంసం చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. ఈ విషయమై అధికారులను సంప్రదించగా ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలిపారు.