కారు అదుపు తప్పి భీభత్సం సృష్టించడంతో ఇద్దరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రభు మహరాజ్ తన కుమారులు దీపక్, సత్తునాథ్‌తో కలిసి నగరానికి వచ్చి మైలార్‌దేవ్‌పల్లిలోని ఫుట్‌పాత్‌పై దుప్పట్లు, బ్లాంకెట్లు విక్రయిస్తున్నారు. రోజు మాదిరిగానే ముగ్గురు ఫుట్‌పాత్‌పై వేసుకున్న గుండారంలో నిద్రిస్తున్నారు. నగరానికి చెందిన ఆరుగురు యువకులు ఇన్నోవా కారులో శంషాబాద్ నుంచి సంతోష్ నగర్‌కు వెళ్తున్నారు. కారును అతివేగంగా డ్రైవ్ చేయడంతో తెల్లవారుజామున 5 గంటలకు అదుపు తప్పి బాధితులు ఉన్న గుడారంపైకి దూసుకుని వెళ్లింది. దీంతో ప్రభుమహరాజ్, దీపక్ మృతిచెందగా, సత్తునాథ్‌కు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఇన్నోవా కారులో ఉన్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారు. మృతిచెందిన ఇద్దరిని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.