ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో స్పీకర్ తీర్పు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పరిహాసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. బుధవారం స్పీకర్ ఇచ్చిన తీర్పుపై హరీశ్ రావు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై ఢిల్లీలో ఒక మాట..తెలంగాణలో మరోమాట మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగంపై రాహుల్ నినాదం తెలంగాణలో వర్తించదా అని ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయంతో కాంగ్రెస్ ద్వంద్వ విధానం బట్టబయలైందని అన్నారు. ఢిల్లీలో రాజ్యాంగం పరిరక్షణపై మాట్లాడే కాంగ్రెస్ రియల్ ఫేస్ తెలంగాణలో స్పీకర్ తీర్పుతో బయటపడిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను కూడా దిగజార్చడం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లిందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన యాంటీ-డిఫెక్షన్ నియమాలను పూర్తిగా పక్కన పెట్టి అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగాన్ని కాలరాయడమేనన్నారు. సేవ్ ది కాన్‌స్టిట్యూషన్ నినాదం మాటలకే పరిమితమై, ఆచరణలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని ఇది ఎంతో సిగ్గుచేటు అని, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని అన్నారు.