మూడో విడత పంచాయతి ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య పోటా పోటీగా సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. మూడో విడతలోనూ బిఆర్ఎస్, కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతోంది. అయితే, వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. బిఆర్ఎస్, కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల వాగ్వాదం నెలకొంది. మాటా మాట పెరగడంతో తోపులాట జరిగి ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. వెంటనే పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన బిఆర్ఎస్ అభ్యర్థిని మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.