తెలంగాణ ముఖ్యమంత్రి విద్యా విజన్ ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’. ఆయన ఎక్కడ మాట్లాడినా అదే విషయం చెబుతుండడాన్ని బట్టి ఆయన ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి గత రెండేళ్ళు విద్యామంత్రిగా సైతం ఆయన పోకడలో ఒకింత కన్ఫ్యూజన్ ఒక మేరకు కనిపిస్తోంది. అసలు రేవంత్ చెబుతున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ నేటి ప్రాపంచిక అవసరాల కనుగుణమైన ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో కూడిన విద్యనందించే లక్ష్యం! మంచిదే. దాని సాధ్యాసాధ్యాలు పరిశీలన చేస్తే రేవంత్ విద్యకు కేటాయిస్తానని చెబుతున్న 15% బడ్జెట్ సరిపోతుందా! అనుమానమే. ఒకవేళ దీర్ఘకాలిక ప్రణాళిక అమలు జరిపినా దాని పర్యావసానాలు ఎటు దారితీస్తాయి? తెలంగాణలో విద్యా సమానత, ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ, ప్రస్తుతం ఉన్న రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థ ఉనికి, పర్యావసానాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు ముందు ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ నిర్మాణ స్వరూపం పరిశీలన చేద్దాం. 25 ఎకరాల సువిశాల స్థలం. కోట్లాది రూపాయల విశాలమైన తరగతి గదుల నిర్మాణం, 124 మంది ఆధునిక శిక్షణ పొందిన బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, 2600 మంది విద్యార్థుల సామర్థ్యం, ఒక్కో పాఠశాల నిర్మాణానికి 200కోట్ల రూపాయల వ్యయం వెరసి ఈ పాఠశాల స్వరూప స్వభావం.
ఇంత భారీ స్థాయి ప్రణాళికతో రూపొందించిన 58 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు 2024లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంఖుస్థాపన జరిపారు. ఇప్పటికే ఈ పాఠశాలల నిర్మాణం కోసం రూ. 15,600 కోట్లు ఖర్చు చేసినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 200 పాఠశాలలకు రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తానంటున్న ఈ పాఠశాలలు కనీసం మండలానికి ఒకటి ఏర్పాటు చేసినా 634 మండలాల్లో యంగ్ ఇండియా పాఠశాలలకు 1,26,800 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అంటే మన రాష్ట్ర ఏడాది బడ్జెట్. మొత్తం పాఠశాలలు పూర్తి అయితే 16 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించినట్లు అవుతుంది. ఆలోచన మంచిదే! కానీ, ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులు చూద్దాం. 2023 -24 విద్యా గణాంకాలు ప్రకారం రాష్ట్రంలో 30,022 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 27 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. లక్షమంది సుశిక్షితులైన బోధనా సిబ్బంది ఉంది. మరో వెయ్యి కెసిఆర్ స్థాపించిన రెసిడెన్షియల్ స్కూల్స్, కేంద్రం స్థాపించిన కెజిబివి, కేంద్రీయ విద్యాలయాలు, ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. వీటి భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. ఇప్పటికే అనాలోచితంగా రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపన వలన ఐదు లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నమోదు తగ్గిపోయింది. ఈ ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’ విధానం కనీసం మండలానికి ఒకటి నిర్మించినా 16 లక్షల మంది విద్యార్థులు నమోదు ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో తగ్గిపోనున్నది.
ముఖ్యమంత్రి నియమించిన విద్యా కమిషన్ సేకరించిన వివరాల ప్రకారం 19 వేల ప్రాథమిక పాఠశాలల్లో 13 వేల పాఠశాలల్లో 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. 5 వేల పైచిలుకు ఉన్నత, 4 వేల పైచిలుకు ప్రాథమికోన్నత పాఠశాలలది అదే పరిస్థితి. అంటే బోధనా సిబ్బంది ఉండి, పిల్లలు లేని మూడొంతులు పాఠశాలల్లో ప్రజాధనం కొన్నెండ్లుగా పాలకులు వేతనాలు రూపంలో వృథా చేస్తున్నారు. తెలంగాణకు కేటాయించిన 23 వేలకోట్ల రూపాయలు విద్యా బడ్జెట్‌లో సుమారు 18 వేల కోట్లు వేతనాలకే ఖర్చు అవుతుంది. అంటే యంగ్ ఇండియా స్కూల్స్ ప్రారంభం అయితే, ప్రభుత్వ పాఠశాలలన్నీ, రెసిడెన్షియల్ పాఠశాలలు అన్ని దాదాపు మూతపడతాయి. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా వసతులు, నాణ్యమైన విద్య అందే పాఠశాలలనే ఎంపిక చేసుకుంటారు. ఒక్కో పాఠశాలకు 25 ఎకరాల చొప్పున 15 వేల 800 ఎకరాల పంట భూములు సేకరించాల్సి ఉంటుంది. అయితే, ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు ఎకరం భూమి వేసుకున్నా 30 వేల ఎకరాల విలువైన పాఠశాలల స్థలాలు నిరుపయోగంగా మిగులుతాయి. గత 3 దశాబ్దాలుగా కోట్లాది రూపాయల నిధులతో నిర్మించిన సర్వశిక్షా అభియాన్ తరగతి గదులు పడావు పడతాయి? వీటన్నింటికీ మించి సర్వశిక్షా అభియాన్ నిర్ణయించిన ఐదు కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాల, మూడు కిలోమీటర్ల లోపు ప్రాథమికోన్నత పాఠశాల, కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాల ‘అందుబాటు’ అనే సమస్య తలెత్తుతుంది.
ఒకవేళ రవాణా సౌకర్యం కల్పించినా తలకు మించిన భారమే. ఇంత చేసి 16 లక్షల మంది విద్యార్థులకు ‘యంగ్ ఇండియా స్కూల్స్’ లో ప్రవేశం కల్పిస్తే ప్రస్తుత గణాంకాలు ప్రకారం ప్రభుత్వ పాఠశాల ల్లో ఉన్న 24 లక్షల మందిలో 8 లక్షల మంది విద్యార్థులు భవితవ్యం ఏమిటి? వారికి మన విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం విద్యా సమానత, పిల్లవాడు తాను నచ్చిన పాఠశాలలో విద్యా నేర్చుకునే హక్కును నిరాకరించినట్లే కదా? అప్పుచేసి పప్పుకూడులా లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఉన్న భూములు వినియోగం చేసుకోకుండా మరో 15 వేల ఎకరాల పంట భూములు సేకరించి, లక్ష కోట్లకుపైగా నూతన నిర్మాణాలు చేయడంలో పారదర్శకత ఎంత? యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణం, భూసేకరణలో కమీషన్ల దందాను, అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి పాలసీ తీసుకోబోతుంది? ఇట్లాంటి విషయాలన్నీ ఆలోచించాల్సిన సమయం ఇది. కనుక ప్రపంచ విద్యా స్థాయి అందుకోవాలనే రేవంత్ రెడ్డి ఆలోచనలు స్వాగతిస్తూనే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ, రెసిడెన్షియల్ పాఠశాల వ్యవస్థ పర్యావసానాలు, సంస్కరణ గురించి లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే ఆకునూరి మురళి, కె. కేశవరావు లతో రెండు కమిషన్లు వేసిన ప్రభుత్వం వాటి సిఫార్సులు ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ సంస్కరణలో పరిగణనలోనికి తీసుకొన్న దాఖలాలు కనిపించడం లేదు? వీటన్నింటికీ మించి గత కొన్ని దశాబ్దాలుగా పాలకులే విద్యా బాధ్యతల నుండి వైదొలిగేందుకు, లేక ప్రజల అవసరాలకు తగ్గ పాఠశాల వ్యవస్థ మార్పులు అందించలేకపోయిన పర్యావసానంగా కుప్పలుతెప్పలుగా పెరిగిన ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రభుత్వం ఎలాంటి అంచనాలతో చూస్తుంది.
37 లక్షల విద్యార్థుల నమోదు ఉన్న 12 వేల పైచిలుకు ప్రైవేటు పాఠశాల వ్యవస్థలోనూ ఉన్న పేద, మధ్య తరగతి విద్యార్థుల నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య గురించి, వాటిలో పని చేస్తున్న వేలాది నిరుద్యోగులు గురించి ప్రభుత్వానికి పట్టకపోతే ఎలా? ఇత్యాది విశాలమైన సమస్యలు చర్చించి చేపట్టే విద్యా పథకం మాత్రమే దీర్ఘకాలిక లక్ష్యంతో సఫలమవుతుంది. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్’ కలను పై సమస్యలన్నింటితో అనుసంధానించి పథక రచన చేసినప్పుడు మాత్రమే, పథకం సత్ఫలితాలు ఇస్తాయి. ఆలోచనలు ఎన్నైనా రావచ్చును గాని, నిర్దిష్టమైన ఆచరణ, సరైన ప్రణాళికతో మాత్రమే నూతన విద్యా వ్యవస్థకు రూపకల్పన చేయగలుగుతాము. సిఎం రేవంత్ రెడ్డి అన్ని కోణాల్లో ఆలోచించి నూతన సవాళ్ళను ఎదుర్కోగలిగిన విద్యా వ్యవస్థ రూపకల్పనలో విద్యారంగ మేధావులు, ప్రజల సలహాలు స్వీకరించడం, అనుసరించడం ప్రజాస్వామిక ఆలోచన అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులను వేయాలని కోరుకుందాం. విద్యా వ్యవస్థ ఆధునీకరణను స్వాగతిద్దాం.
ఎన్.తిర్మల్
94418 64514