ఐపిఎల్ వేలం పాట క్రికెటర్లపై కనక వర్షం కురిపించింది. 2026 సీజన్ కోసం అబుదాబి వేదికగా మంగళవారం క్రికెటర్ల వేలం పాట జరిగింది. వేలంలో అన్‌క్యాప్‌డ్ క్రికెటర్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలు నయా చరిత్రను లిఖించారు. ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడని వీరిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి.చివరికి చెన్నై సూపర్ కింగ్స్ ఇద్దరికి చెరో రూ.14.20 కోట్లను వెచ్చించి కొనుగోలు చేసింది. ఇద్దరు కూడా కనీస ధర రూ.30 లక్షలతో వేలం బరిలో దిగారు. కానీ వీరు ఎవరూ ఊహించని విధంగా కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోవడం విశేషం. కాగా, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ వేలంలో కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయాడు. ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్‌గా గ్రీన్ నయా చరిత్ర సృష్టించాడు.