వాషింగ్టన్: 60 ఏళ్ల భారత సంతతి మహిళ తన గ్రీన్ కార్డు ఆఖరి దఫా ఇంటర్వూ కోసం వెళ్లగా ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. 1994 నుంచి అమెరికాలో చట్టబద్ధ హోదాలో నివసిస్తున్న బబ్లెజిత్ (బబ్లీ) కౌర్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఇద్దరికి అమెరికా పౌరసత్వం ఉంది. మరో కుమార్తె జోతికి అమెరికాలో నివసించేందుకు లీగల్ స్టేటస్ ఉంది. పెండింగ్‌లో ఉన్న గ్రీన్ కార్డు దరఖాస్తుకు సంబంధించి బయోమెట్రిక్ స్కాన్ కోసం తమ తల్లి డిసెంబర్ 1 న ఫెడరల్ ఏజెంట్ ఆఫీస్‌కి వెళ్లినట్టు జోతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆమెను అరెస్టు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారని చెప్పారు. కౌర్ తన న్యాయవాదితో మాట్లాడడానికి అక్కడ అధికారులు అవకాశం కల్పించినా ఆమెను అరెస్టు లోనే ఉంచారని జోతి చెప్పారు. ఆమెను ఎక్కడికి తీసుకు వెళ్లారో కొన్ని గంటల పాటు కుటుంబానికి తెలియలేదు. ఆ తరువాత రాత్రికి రాత్రి ఆమెను అడెలాంటోకు తీసుకు వెళ్లారని తెలిసింది. ఇదివరకటి ఫెడరల్‌జైలును ఇప్పుడు ఐసిఇ డిటెన్షన్ సెంటర్‌గా మార్చి అక్కడ ఆమెను ఉంచారని తెలిసింది. ఈ సంఘటనను తీవ్రంగా ఖండించిన డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా ఆమె విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.