రాష్ట్రంలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీ ఏకంగా రూ.118 కోట్లు విద్యుత్ బకాయిలు ఉండటంపై హైకోర్టు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సామాన్యులు వెయ్యి రూపాయలు బకాయిలు ఉంటేనే ముక్కు పిండి వసూలు చేసే విద్యుత్ శాఖ అధికారులు గీతం యూనివర్సిటీ వంద కోట్ల బకాయిలు ఉంటే ఎలా చూసి చూడకుండా ఉన్నారని మండిపడింది. గీతం యూనివర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకు? అని అధికారులను ప్రశ్నించింది. కాగా, ఏళ్ల తరబడి కరెంట్ బిల్లు కట్టని గీతం యూనివర్సిటీకి ఎస్‌పిడిసిఎల్ నోటీసులు పంపింది. ఎస్‌పిడిసిఎల్ నోటీసులను సవాల్ చేస్తూ గీతం వర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక 2008 నుంచి గీతం యూనివర్శిటీ కరెంట్ బిల్లు చెల్లించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సూపరింటెండింగ్ ఇంజనీర్ హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం పిటిషన్ పై విచారణను వాయిదా వేశారు.