లక్నో: సౌతాఫ్రికాతో బుధవారం జరిగే నాలుగో టి20 మ్యాచ్‌కు ఆతిథ్య టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. కిందటి పోరులో ఓడిన సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో సఫారీ టీమ్ ఎలా ఆడుతుందనేది ఆసక్తికగా తయారైంది. అయితే ఎటువంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగే సత్తా దక్షిణాఫ్రికాకు ఉంది. ఇప్పటికే రెండో మ్యాచ్‌లో ఈ విషయం స్పష్టమైంది. ఇలాంటి స్థితిలో భారత్ ఏమాత్రం నిర్లక్షంగా ఆడినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
గిల్, సూర్యలకు కీలకం..
వరుస వైఫల్యాలు చవిచూస్తున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లకు ఈ మ్యాచ్ సవాల్‌గా తయారైంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ వీరు ఆశించిన స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించలేక పోయారు. గిల్ కిందటి మ్యాచ్‌లో 28 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించాడు. అయితే సూర్య 12 పరుగులకే ఔటయ్యాడు. ఈ పరిస్థితుల్లో ఇద్దరిపై ఒత్తిడి నెలకొంది. దీన్ని తట్టుకుని జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఇందులో వీరు ఎంతవరకు సఫలమవుతారో వేచి చూడక తప్పదు. యువ సంచలనం అభిషేక్ శర్మ ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. హార్దిక్ పాండ్య కూడా జోరుమీదున్నాడు. శివమ్ దూబె, తిలక్ వర్మ, జితేశ్ శర్మ తదితరులతో భారత బ్యాటింగ్ బాగానే ఉంది. అంతేగాక అర్ష్‌దీప్, హర్షిత్, హార్దిక్, వరుణ్, కుల్దీప్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ ఈ పోరులో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.