న్యూఢిల్లీ: దట్టమైన పొగమంచు రాజధాని ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాలుష్యంపై యుద్ధం ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా డిసెంబర్ 18 నుంచి కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ (పియుసి) లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం సరఫరా చేయబడదని ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ప్రకటించారు. అంతేకాకుండా బిఎస్6 ప్రమాణాల కంటే తక్కువ ఉన్న ఢిల్లీయేతర వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు తెలిపారు. అత్యవసర సేవల్లో లేని ట్రక్కులు, వాణిజ్య వాహనాలకు నగరంలో ప్రవేశం నిరాకరిస్తారు. ల్యాండ్‌ఫిల్ సైట్‌ల ఎత్తును 15 మీటర్లు తగ్గించామని, సుమారు 8 వేల పరిశ్రమలను కఠినమైన కాలుష్య నియంత్రణ నిబంధనల కింద తీసుకు వచ్చామన్నారు. కాలుష్యానికి పాల్పడిన పరిశ్రమలకు రూ. 9 కోట్ల జరిమానా విధించామని చెప్పారు.
ప్రజలకు క్షమాపణలు
తొమ్మిది,పది నెలల్లో ఢిల్లీలో కాలుష్యాన్ని పూర్తిగా నిర్మూలించడం ఏ ప్రభుత్వానికైనా సాధ్యం కాదని మంత్రి అంగీకరిస్తూ ఈ విషయంలో ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే రోజువారీ గాలి నాణ్యత సూచీ తగ్గించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.