న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో సిఎం నితీష్ కుమార్ ఒక ముస్లిం మహిళ హిజాబ్‌ను లాగివేయడం వివాదానికి దారితీసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనను పలువురు తీవ్రంగా తప్పు బడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి జైరా వసీం ఎక్స్ వేదికగా ఈ సంఘటనను తీవ్రంగా వ్యతిరేకించారు. సిఎం నితీశ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత మహిళకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
“ఒక మహిళ గౌరవం, మర్యాద.. ఆట వస్తువులు కావు. ముఖ్యంగా బహిరంగ వేదికపై అస్సలు కాదు. ఒక ముస్లిం మహిళగా, మరో మహిళ నిఖాబ్‌ను అంత తేలికగా లాగివేయడాన్ని, దానికి తోడు ఆ నిర్లక్ష్యపు చిరునవ్వును చూడటం చాలా ఆగ్రహం తెప్పించింది. అధికారం హద్దులు దాటడానికి అనుమతి ఇవ్వదు. నితీష్ కుమార్ ఆ మహిళకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి” అని ఎక్స్ వేదికగా జైరా వసీం డిమాండ్ చేసింది. జైరా వసీం 2016లో ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. మూడేళ్ల తర్వాత 2019లో ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పింది.
కాగా, డిసెంబర్ 15న కొత్తగా నియమితులైన ఆయుష్ వైద్యులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో నితీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఓ ముస్లిం మహిళా వైద్యురాలి హిజాబ్‌ను లాగడానికి ప్రయత్నించారు. ఈ సంఘటన వేదికపై ఉన్న పలువురు నాయకులు, అధికారులను షాక్ కు గురిచేసింది.