దుబాయ్: అండర్-19 ఆసియా కప్‌లో భారత్ విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే యుఎఇ, పాకిస్థాన్‌లపై విజయం సాధించిన యువ ఇండియా.. తాజాగా మలేషియాపై భారీ తేడాతో విజయం సాధించింది. ది సెవెన్స్ స్టేడియం వేదికగా.. జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 408 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా ఘోరంగా తడబడింది. భారత బౌలర్ల దెబ్బకు విలవిలలాడిపోయింది. హంజా పంగి (35) మినహా మిగితా వాళ్లెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. మరోసారి దీపేశ్ దేవేంద్రన్ బంతితో విజృంభించాడు. దీంతో మలేషియా 32.1 ఓవర్లో కేవలం 93 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ ఈ మ్యాచ్‌లో 315 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలింగ్‌లో దీపేశ్ 5, ఉద్ధవ్ 2, కిషన్, ఖిలన్, కనిష్క్ తలో వికెట్ తీశారు.