హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మీటింగ్ లో సోషల్ మీడియాలో యాక్టివిటీ పెంచాలని సూచించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సమావేశం విషయాలు బయటకు చెప్పొద్దని ప్రధాని స్వయంగా చెప్పారని అన్నారు. నరేంద్ర మోడీతో టిబిజెపి, ఎంపిల సమావేశంపై వచ్చిన లీకులపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. ప్రధాని చెప్పినా.. మీటింగ్ లో విషయాలను బయటకు చెప్పారని, బయటకు చెప్పిన వారు ఎవరో చెబితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లోపల జరిగింది ఒకటి, బయట ప్రచారం చేసింది మరొకటి అని.. తెలియజేశారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని మోడీ కోరారని అన్నారు. దక్షిణ భారత్ నుంచి ఇప్పటి వరకు ఇద్దరు ఉపరాష్ట్రపతులు అయ్యారని, బిజెపిలో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఓట్ చోరీ ర్యాలీలో మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. రాహుల్ గాంధీ అనైతికంగా మాట్లాడుతున్నారని, ఏ విషయాలు మాట్లాడాలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఉండటం దురదృష్టకరమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.