కథానాయకుడు విశ్వక్ సేన్ హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ’ఫంకీ’. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా థియేటర్లలో ’ఫంకీ’ చిత్రం సందడి మొదలు కానుంది.
అపరిమితమైన వినోదాన్ని అందించనున్న ఈ సినిమాను 2026 ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. తొలుత ’ఫంకీ’ చిత్రాన్ని 2026 ఏప్రిల్ లో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.