మన తెలంగాణ/హైదరాబాద్: రైతులు యూరియా కోసం సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్ద నుంచే అవసరమైన యూరియాను ముందుగానే బుక్ చేసుకునే సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ ను వ్యవసాయశాఖ తీసుకురానుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలిపారు. రబీ ముందస్తు ప్రణాళికపై రాష్ట్ర, జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో సచివాలయంలో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం వారి విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు వ్యవసాయశాఖ కేవలం ఎరువుల పంపిణీ కోసం ఒక కొత్త మొబైల్ యాప్ ను తీసుకురావడానికి సన్నహకాలు చేస్తుందని, దానిని ఈ నెల 20 నుండి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు తమకు సమీపంలోని డీలర్,
జిల్లా పరిధిలోని ఇతర డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ లభ్యతను తెలుసుకోవచ్చన్నారు. రైతు తన పంటలకు అవసరమైన యూరియా పరిమాణాన్ని, తనకు అనుకూలమైన ఏ డీలర్ వద్ద నుంచైనా ముందుగా బుక్ చేసి కొనుగోలు చేసుకునే అవకాశం ఈ యాప్ ద్వారా లభించనుందని మంత్రి పేర్కొన్నారు. అవసరమైతే, యూరియా బుకింగ్ కోసం రైతులు తమ పరిధిలోని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఇఓ)సేవలను కూడా వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు. దేశంలోనే యూరియాని అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటని, రైతులకు యూరియా వాడకం వలన కలిగే నష్టాలను వివరించి, యూరియా వినియోగం తగ్గించాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలన్నారు. అందుకోసం అధికారులు విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.
యాప్‌లో నమోదు ఇలా
-రైతులు/ సిటిజన్, డిపార్ట్ మెంట్, డీలర్ల కోసం వేర్వేరు లాగిన్లు. మొబైల్ నెంబర్, ఒటిపి ద్వారా లాగిన్ అయ్యే అవకాశం. లాగిన్ అవ్వగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బస్తాల యూరియా అందుబాటులో ఉందో కనిపిస్తుంది. లాగిన్ అయిన రైతులు తమ జిల్లాను ఎంపిక చేయగానే ఆ జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా బ్యాగులు కనిపిస్తాయి.- తరువాత సీజన్, పాస్ బుక్ నెంబర్, ఎన్ని ఎకరాలలో పంట వేస్తున్నారో, ఏఏ పంటను వేస్తున్నారో నమోదు చేయాలి. సాగు చేసే ఎకరాలను బట్టి అవసరమయ్యే యూరియా బ్యాగులు యాప్ లో కనిపిస్తాయి. అయితే వారు సాగు చేసే విస్తీర్ణాన్ని బట్టి వారికి అవసరమయ్యే యూరియా బస్తాలను 15 రోజుల వ్యవధితో 1 నుండి 4 దశలలో అందచేసేలా వివరాలు కనిపిస్తాయి. పాస్ బుక్ లు లేని రైతులు వారి పట్టా పాస్ బుక్ దగ్గర ఆధార్ సెలెక్ట్ చేసుకొని, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఒటిపి కన్ఫర్మేషన్ తరువాత వారు వివరాలను నింపాలి.- కౌలు రైతులు కూడా పేరు, తండ్రిపేరు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఒటిపి కన్ఫర్మేషన్ తరువాత భూ యజమాని పట్టా పాస్ బుక్ నెంబర్ ఎంటర్ చేస్తే, యజమాని మొబైల్ నెంబర్ తో ఒటిపి వ్యాలిడేషన్ తరువాత కౌలు రైతులు కూడా తమ వివరాలు ఎంటర్ చేసేలా ఈ యాప్ లో అవకాశం కల్పించారు.- ఇక, డీలర్లు తమ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయి, రోజువారిగా వారికి వచ్చిన స్టాక్, అమ్మకం వివరాలను నింపాల్సి ఉంటుంది.
యూరియా పొందడం ఇలా
యూరియా బుక్ చేసిన అనంతరం రైతుకు ఒక బుకింగ్ ఐడి వస్తుందని, ఆ బుకింగ్ ఐడి ఆధారంగా రైతు ఎంపిక చేసిన డీలర్ వద్ద నుంచి యూరియాను కొనుగోలు చేయవచ్చన్నారు. సంబంధిత డీలర్, రైతు లేదా అతని ప్రతినిధి వద్ద ఉన్న బుకింగ్ ఐడి, బుక్ చేసిన పరిమాణాన్ని ధృవీకరించిన తరువాతే యూరియాను విక్రయిస్తారని మంత్రి పేర్కొన్నారు. బుకింగ్ సమయంలో రైతు కేవలం పంట పేరు, సాగు విస్తీర్ణం నమోదు చేస్తే సరిపోతుందని దీంతో నమోదు చేసిన వివరాల ఆధారంగా, వ్యవస్థ స్వతంత్రంగా రైతుకు అవసరమయిన మొత్తం యూరియా పరిమాణాన్ని, ఏ ఏ వ్యవధుల్లో బుక్ చేసుకోవచ్చో లెక్కిస్తుందన్నారు. రైతుల సౌకర్యార్థం, ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లతో కూడిన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ కూడా అందుబాటులో ఉంటుందని మంత్రి వివరించారు. అధికారులందరూ యాప్ గురించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, యాప్‌ను అమలలోకి తీసుకురావాలని ఆదేశించారు. యూరియా పక్కదారి పట్టకుండా, పంట పండించే రైతులకు మాత్రమే యూరియా అందించాలనే లక్ష్యంతో ఈ యాప్ ని రైతుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.