మనతెలంగాణ/హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. గ్రామాల్లో ఎంఎల్‌ఎ ఎన్నికల కన్నా గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటేనే నువ్వానేనా అన్నట్లు పోరు సాగుతోంది. ఎందుకంటే గ్రామాల్లో పట్టు నిలుపుకుంటే పార్టీలకు రా ష్ట్రంలో సులువుగా అధికారం దక్కుతుందని నా యకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గ్రా మాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన మంత్రులు, ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలు, పార్టీల ముఖ్య నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో 8,566 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంతో ముం దంజలో నిలిచింది.- మొత్తం 5,275 సర్పంచ్ స్థానాలు (61.58 శాతం) కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అలాగే బిఆర్‌ఎస్ రెండో స్థానంలో 2,330 స్థానాలు (27.20 శాతం) సాధించి పల్లె పోరులో పట్టు నిలుపుకుంది. బిజెపి పార్టీ మూడో స్థానంలో- 453 సీట్లు (5.29 శాతం) గెలుచుకోగా, స్వతంత్రులు/ఇతరులు 483 సీట్లు (5.64 శాతం) పొందారు.
పట్టు నిలబెట్టుకునేలా వ్యూహాలు’తొలి విడత, రెండో విడత పల్లె పోరులో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సంక్షేమం, అభివృద్ధి ప్రచారాస్త్రాలు చేసుకొని ఓటర్లను ఆకట్టుకున్నారు. తమ ప్రభుత్వం మరో మూడేళ్లు అధికారంలో ఉంటుందని పల్లెలను ప్రగతి రథంలో నిలుపుతామని హామీలు ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేరేలా కృషి చేస్తామని చెప్పారు. దీంతో అక్కడ పల్లెల్లో కాంగ్రెస్ రెండు విడతల్లో విజయకేతనం ఎగురేసింది. బిఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు గత పదేళ్లలో ప్రభుత్వం అందించిన పథకాలు వివరిస్తూ రాబోయేది మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ఓటర్లకు ఆకట్టుకున్నారు. తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా తాము చొరవ తీసుకుంటామని ప్రచారం చేసున్నారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని, సంక్షేమ పథకాలకు ఎలాంటి ఢోకా ఉండదని బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఓటర్లను వివరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలంటే తమను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో బిజెపి అధికారంలోకి వస్తుందని ప్రచారం చేసుకుని ఓటర్లను ఆకట్టుకున్నారు. రెండు విడతల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మూడు ప్రధాన పార్టీలు మూడో విడతల్లో సత్తా చాటేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రెండు విడతల్లో ఏమైనా లోపాలు ఉంటే సరిచేసుకుని మూడో విడతలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుపొందేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గుర్తులు గుర్తుండిపోయేలా ఏర్పాట్లు
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు గుర్తులు ఓటర్లకు గుర్తుండిపోయలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమ గుర్తులను ఓటర్లు మరిచిపోకుండా ఉండేలా వీడియోలు, ఫొటోలు రూపొందించడంతో పాటు ఆయా గుర్తులను ఇంటింటికీ చూపిస్తూ ప్రచారం నిర్వహించడంతో పాటు వాట్సాప్, ఫేస్‌బుక్ సహా ఇతర సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. తొలి, రెండో విడత పోలింగ్ జరిగిన గ్రామాల్లో పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత కొత్తగా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల తరఫున ఆయా నియోజకవర్గ ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలు, పార్టీల అగ్రనేతలు ప్రచార బరిలోకి దిగారు. గ్రామాలలోని సామాజిక వర్గాల వారీగా పోటాపోటీ సమావేశాలు నిర్వహించి ఓట్లు గంపగుత్తగా సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హామీలు గుప్పించడంతో పాటు ఆయా కుల సంఘాలు,యువజన సంఘాలు, మహిళా సంఘాలు కోరిన డబ్బులు, బహుమతులు అందిస్తున్నారు. కొందరు ముందుగానే కొంత మొత్తం ఇచ్చి గెలిచిన తరువాత మిగతాది ఇస్తామని చెబుతుంటే మరికొందరు మొత్తం డబ్బు ఇచ్చేస్తూ ఓటర్లు కోరిన పనులు సర్పంచ్ కాగానే చేస్తామని మాటిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి గ్రామంలో ఉన్న ఓట్ల సంఖ్య ఆధారంగా కుల, యువజన, మహిళా సంఘాలకు కోరినంత నజరానాలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమకు ఓట్లు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని వాగ్దానాలు చేస్తున్నారు. గ్రామంలోని సిసి రోడ్ల నిర్మాణాలు, బోరుబావుల తవ్వకం, తాగునీటి శుద్ధి కేంద్రం, గ్రంథాలయం, క్రీడా వసతులు, పాఠశాల భవనాల నిర్మాణం, సిసి కెమెరాల ఏర్పాటు లాంటి అవసరాలను గెలిచిన వెంటనే నెరవేరుస్తామని అభ్యర్థులు చెబుతున్నారు. దీంతో పాటు గత సర్పంచ్‌ల వైఫల్యాలు, ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూపుతూ ఈ ఎన్నికల్లో తమనే గెలిపించమని వేడుకుంటున్నారు.
ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారం
రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సోమవారం(డిసెంబర్ 15) సాయంత్రం 5 గంటలకు ముగిసింది.ప్రచారం ముగిసిన తర్వాత బహిరంగ సమావేశాలు, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియోలలో ప్రచారం నిర్వహించడం పూర్తిగా నిషేధం అని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఇసి) ఇదివరకే మార్గదర్శకాలు జారీ చేసింది. పోలింగ్‌కు 44 గంటల ముందు ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం నిర్వహించకుండా ఎన్నికలు జరిగే ఆంక్షలు విధించింది. మూడో విడతలో 4,157 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలకు, 36,434 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించారు. అందులో 394 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం కాగా, అత్యధికంగా నల్గొండలో 42, సంగారెడ్డిలో 27, కామారెడ్డి జిల్లాలో 26 గ్రామ పంచాతీయల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా 7,916 స్థానాలు ఏకగ్రీవంగా అయ్యాయి. సర్పంచ్ స్థానాలకు మొత్తం 12,640 మంది అభ్యర్థులు పోటీలు నిలువగా, వార్డు స్థానాలకు 75,283 మంది బరిలో ఉన్నారు. ఈ నెల 17వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మూడో విడత పోలింగ్ జరగనుంది. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచి ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ జరిగే ప్రాంతాలలో సోమవారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూసివేయగా, తిరిగి 17న సాయంత్రం తెరుచుకోనున్నాయి.