మన తెలంగాణ/హైదరాబాద్; ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం హస్తినలో విశ్రాంతి తీసుకున్నారు. అధికార, అనధికార (పార్టీ) కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఢిల్లీలో ఏఐసిసి అధ్వర్యంలో ఆదివారం జరిగిన ఓట్ చోర్ గద్దీ చోడ్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం హైదరాబాద్‌కు చేరుకుని, రవీంద్ర భారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కాగా, ఆయన సోమవారం ఎవరికీ అప్పాయింట్‌మెంట్స్ ఇవ్వకుండా గడిపారు. శనివారం ఆయన ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీతో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లో పాల్గొన్నారు. మ్యాచ్‌లో పాల్గొనేందుకు ప్రాక్టీస్ చేసి అలసటగా ఉన్నందున విశ్రాంతి తీసుకున్నారని సన్నిహితులు చెబుతున్నా, మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై మంతనాలు జరపడంలో బిజీగా గడిపారని పార్టీ నాయకుల ద్వారా సమాచారం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్‌తో కూడా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు
ప్రముఖ క్రికెటర్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ముగ్గురు కొత్త వారికి అవకాశం లభిస్తుందని అప్పుడు ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు జరగబోయే పునర్ వ్యవస్థీకరణలో ఇరువురికి ఉద్వాసన ఉంటుందన్న ప్రచారాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం తనను కలిసిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. అధిష్టానం అనుమతితో పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ఉండే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. తనకు మంత్రివర్గంలో చేరాలన్న ఆసక్తి లేదని, తాను పిసిసి అధ్యక్ష పదవితో సంతృప్తిగా ఉన్నానని ఆయన మీడియా ప్రతినిధులతో తెలిపారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారని పార్టీ నాయకులు భావిస్తున్నారు.