మన తెలంగాణ / హైదరాబాద్/ఖమం బ్యూరో: దేశంలో రిజర్వేషన్‌లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసి జనాభా దమాష ప్రకారం బిసి రిజర్వేషన్లు పెంచాలని లేనిపక్షంలో సామాజిక తిరుగుబాటు తప్పదని అఖిలపక్ష పార్టీల నేతలు, బిసి సంఘాలు జెఎసి నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఇచ్చిన చలో ఢిల్లీ పిలుపుమేరకు సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బిసిల మహాధర్నా జరిగింది. ఈ మహా ధర్నాకు టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ జాతీయ నాయకుడు కె. నారాయణ, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ బిఆర్‌ఎస్ ఎంపి వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి,మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు, రాపోలు ఆనంద భాస్కర్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కుంతియా, ఎపి బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, మహారాష్ట్ర అధ్యక్షులు సచిన్ రాజోలుకర్ హాజరయ్యారు. బిసి రిజర్వేషన్ల పెంపు పై కాంగ్రెస్ వెనుకడుగు వేయదని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. స్థానిక పరిస్థితుల దృష్టా గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించామే తప్ప, బిసి రిజర్వేషన్ల ప్రక్రియ నుండి కాంగ్రెస్ పార్టీ వైదొలగలేదని ఆయన స్పష్టం చేశారు. ఢీల్లీలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే తో ఇప్పటికే చర్చించామని, అతి త్వరలోనే కేంద్రంపై పోరాడడానికి తమ రాజకీయ కార్యచరణ ప్రకటిస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
బిజెపి అడ్డుపడుతోంది : నారాయణ
బిసి రిజర్వేషన్లు అమలు కాకుండా బిజెపి అడుగడుగునా అడ్డుపడుతుందని సిపిఐ జాతీయ నాయకుడు డా. కె. నారాయణ అన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను తమ చేతిలో పెట్టుకుని బిసి రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు . తెలంగాణ నుండి ఎన్నికైన ఎనిమిది మంది బిజెపి ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దెబ్బకు దిగి వస్తుందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ రాజకీయ డ్రామాలు : బిఆర్‌ఎస్ నేతలు
కామారెడ్డి డిక్లరేషన్ నుండి కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామాలు ఆడుతోందని బిఆర్‌ఎస్ నేతలు వి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టినా, చట్టం చేసినా బిఆర్‌ఎస్ పార్టీ అండగా నిలబడిందని, కాని కాంగ్రెస్ చిత్తశుద్ధితో ప్రయత్నించకుండా వ్యహరిస్తుందని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వచ్చి ప్రధాని కలవాలని డిమాండ్ చేసినా కలవడం లేదని, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి నేతలు పార్లమెంటులో కనీసం మాట్లాడడం లేదని అన్నారు. అనేక బిల్లులను కాంగ్రెస్ బిజెపిలు కలిసి పార్లమెంటులో ఆమోదించుకున్న సందర్భాలు ఉన్నాయని, బిసి బిల్లు విషయంలో మాత్రం రొండు పార్టీలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని వారన్నారు. బిసి రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల చిత్తశుద్ధి ఎండగట్టడానికి పార్లమెంటులో ప్రవేట్ బిల్లును ప్రవేశపెట్టామని, కాంగ్రెస్ బిజెపిలకు చిత్తశుద్ధి ఉంటే బిఆర్‌ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు మద్దతు తెలపాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే 2014 జూన్ 14వ తేదీన చట్టసభల్లో మహిళలు, ఒబిసిలకు 33 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కెసిఆర్ అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి సిఫార్సు చేయడాన్ని ఈ సందర్భంగా వద్దిరాజు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కెసిఆర్ నాయకత్వాన జరిగిన మహోద్యమం మాదిరిగానే బిసిల న్యాయమైన హక్కులు, రాజ్యాధికారంలో సముచితమైన వాటా కోసం తమ పార్టీ పోరాడుతుందన్నారు. కుల గణనలో బిసిల జనాభాను తక్కువ చేసి చూపడం, కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం, ఇతర 56 అంశాల గురించి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ తమ పార్టీ ఉద్యమించిందని అన్నారు. దీనిని మరింత ఉద్ధృతం చేయడంలో భాగంగానే కెసిఆర్ మార్గనిర్దేశనంలో పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టామని వివరించారు. కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు బిసి,
ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన 432 హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధినేత రాహూల్ గాంధీకి ఓట్ చోర్ అంశంపై ఉన్న ఆసక్తి బిసి రిజర్వేషన్లు పెంచే విషయంలో ఇసుమంత కూడా చూపకపోవడం శోచనీయమన్నారు. తమ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు వారి అధినాయకత్వాలపై వత్తిడి పెంచి ఆమోదం పొందేలా చూడాలని కోరారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి మాట్లాడుతూ బిసి బిల్లు పై పార్లమెంట్లో కొట్లాడుతున్న బిజెపి స్పందించడం లేదని అన్నారు. మల్లు రవి మాట్లాడుతుండగా బిసి సంఘాల నేతలు అఖిలపక్షంతో సిఎం ఢిల్లీకి ఎందుకు రావడం లేదని పార్లమెంటులో రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ఉపన్యాసానికి అడ్డు తగిలారు.
మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు మాట్లాడుతూ బిసి ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నప్పటికీ బిసిలకు న్యాయం జరగకపోవడం దురదృష్టకరమన్నారు. పార్లమెంటులో బిసి రిజర్వేషన్లపై ప్రైవేటు బిల్లు పెట్టే లా రాహుల్ గాంధీ పై ఒత్తిడి తెస్తామన్నారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిసి రిజర్వేషన్ల ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉదృతం చేస్తున్నామన్నారు. అయినప్పటికీ బిజెపి కాంగ్రెస్ పార్టీలు స్పందించకుండా బిసిలకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇప్పటికీ రెండుసార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపటినా అఖిలపక్షంతో ఎoదుకు ప్రధాని కలవడం లేదని ప్రశ్నించారు. బిజెపి బీసీలకు బద్ద శత్రువుగా మారిందని, నాటి మండల్ నుండి నేటి బిసి రిజర్వేషన్ల వరకు బిసిలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బిసి రిజర్వేషన్లు అమలు చేయని బిజెపిని, ఒత్తిడి పెంచని కాంగ్రెస్ పార్టీ లను బిసిలు విశ్వసించరని వారికి తగిన బుద్ధి చెబుతామని జాజుల హెచ్చరించారు. ఈ మహా ధర్నాకు బిసి జెఎసి వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ సమన్వయం చేయగా బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, మహిళా సంఘం అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, పెరిక సురేష్, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, వీరస్వామి, పిట్ల శ్రీధర్, కౌల జగన్నాథం, నాగ మల్లేశ్వరరావు, నందగోపాల్, జాజుల లింగం గౌడ్, వేముల రామకృష్ణ, మడత వెంకట్ గౌడ్, గూడూరు భాస్కర్, స్వర్ణ, గౌతమి, ఉదయనేత, శివమ్మ, శివకుమార్, సుమన్ , బిక్షం గౌడ్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.