న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీలో బెదిరింపు నినాదాలు చేయడంపై సోమవారం లోక్‌సభలో అధికార పార్టీ ఎంపీలు భగ్గుమన్నారు. దీనితో సమావేశాల వాయిదాకు దారి తీసింది. బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు పరస్పర ధూషణలకు దిగడంతో లోక్‌సభ మొదటిసారి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటల వరకు, వాయిదాలు పడింది. ఆదివారం నాడు కాంగ్రెస్ ర్యాలీలో మోడీకి సమాధి తవ్వుతాం అని నినాదాలు చేయడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పు పట్టారు. విపక్షం నుంచి అగ్రనాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దీనిపై సభలో గందరగోళం ఏర్పడడంతో స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. 12 గంటల తరువాత తిరిగి సభ సమావేశాలు ప్రారంభం కాగా, కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకుపోయి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న బీజేపీ సభ్యుడు దిలీప్ సైకియా పార్లమెంటరీ పేపర్లను అనుమతించారు. జీరో అవర్ తరువాత కాంగ్రెస్ సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో సైకియా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఉదయం 11గంటలకు మొదట సభ సమావేశమైనప్పుడు ఇటీవలనే దివంగతులైన ముగ్గురు మాజీ ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా నివాళి అర్పించారు.