జమ్ము : పహల్గాం ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) సోమవారం స్పెషల్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. 1597 పేజీల ఈ ఛార్జిషీట్‌లో ఆరుగురు నిందితులతోపాటు పాకిస్థాన్ ఆశ్రయంగా ఉన్న రెండు ఉగ్రవాద సంస్థలను పేర్కొంది. పాకిస్థాన్‌కు చెందిన హఫీజ్ సయీద్ నేతృత్వం లోని లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) , దాని అనుబంధ సంస్థ ‘హబీబుల్లా మాలిక్ ఆధ్వర్యంలోని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)ఈ దాడికి కుట్రపన్ని అమలు చేసినట్టు తన ఛార్జిషీట్‌లో ఎన్‌ఐఏ పేర్కొంది. పాక్‌కు చెందిన సాజిద్ జాట్ అనే హ్యాండ్లర్ పేరును కూడా చేర్చింది.
ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు , ఫైజల్ జాట్ ఎలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ ఎలియాస్ జిబ్రాన్, హమ్జా అఫ్గానీలు ఆపరేషన్ మహాదేవ్‌లో హతమైనట్టు తెలియజేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పర్వైజ్ అహ్మద్ , బషీర్ అహ్మద్ జోధర్‌ల పేర్లను పొందుపర్చింది. దాదాపు ఎనిమిది నెలల పాటు సమగ్ర శాస్త్రీయ దర్యాప్తు నిర్వహించిన ఎన్‌ఐఎ, ఈ కేసులో పాకిస్థాన్ ప్రమేయం ఉన్నట్టు గుర్తించింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ పహల్గాం లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయ వద్ద ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.