జాతిపితకు మీరిచ్చే గౌరవం ఇదేనా?
ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసేందుకు కుట్ర
పనిదినాలు, కూలీ పెంచమని సిఫారసు చేస్తే రద్దుకే మొగ్గు చూపుతారా?
వికసిత్ భారత్ పేరిట ఆర్భాటం
లోక్‌సభలో విపక్షాల ధ్వజం
న్యూఢిల్లీ : పేరు మార్పిడి వ్యవహారం ప్రభుత్వానికి ఇరకాట పరిస్థితి తెచ్చిపెట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకానికి ఇప్పటివరకూ ఉన్న మహాత్మా గాంధీ పేరును ఎందుకు తీసివేశారని సోమవారం ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. గ్రామీణ స్థాయిలో పేద బడుగు వర్గాల కూలీలకు రోజువారి ఉపాధి హామీ కల్పించేందుకు మహాత్మా గాంధీ పేరిట ఉపాధి పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజి) అమలులో ఉంది. అయితే కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన బిల్లు ద్వారా గాంధీజీ పేరును తొలిగించింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవిక మిషన్ (గ్రామీణ్) (విబి జి రామ్ జి) పేరిట కొత్త బిల్లు తీసుకురావాలని నిర్ణయించడం విపక్షాల వ్యతిరేకతకు కారణణమైంది. పథకం పేరులోంచి గాంధీజీ పేరు తొలగించడం ఎందుకు జరిగింది? ఇది జాతిపితను అవమానించడం, ఆయన జ్ఞాపకాలను చెరిపివేయడం కిందికి రాదా? అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కొత్త బిల్లును ప్రభుత్వం ‘విబి జి రామ్ జి బిల్లు2025’ గా లోక్‌సభలో అనుబంధ పద్దుల జాబితాలో సభ ముందుకు తీసుకువచ్చింది.
గ్రామీణాభివృద్ధి , పంచాయతీరాజ్ పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యక్షులుగా ఉన్న కాంగ్రెస్ ఎంపి సప్తగిరి ఉలాకా ఈ విషయంపై నిరసన వ్యక్తం చేశారు. తమ ప్యానల్ పలుసార్లు ఈ పథకం పరిధిలో పనిదినాలు, సంబంధిత వేతనాల పెంపుదల గురించి ప్రభుత్వానికి పలుసార్లు సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం నీరుగారిందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ తరచూ ఈ పథకం పనికిరానిదని, కేవలం గుంతలు తీయడానికి పనికివస్తుందని విమర్శించారని తెలిపారు. మొత్తం మీద ఈ పథకం ఎత్తివేతకు ఆయన ఆలోచించారని ఉలాకా ఆరోపించారు. బాపూ , జాతిపిత పేరు అంటే వారికి ఎందుకు ఇంత మంట అని నిలదీశారు. పథకం కాంగ్రెస్ హయాంది కాబట్టి దీనిని మొత్తానికే చెత్తబుట్ట దాఖలు చేయాలని కేంద్రం ఆలోచిస్తోందని విమర్శించారు. ప్యానెల్ సారధిగా తాను పలు సిఫార్సులు చేశానని, లోపాలు, మంచిచెడులు ప్రస్తావించానని గుర్తు చేశారు. పనిదినాలను కనీసం 150 రోజులకు పెంచాలని, జీవన వ్యయం పెరుగుతున్న దశలో రోజు వారి కూలీ స్థాయిని పెంచాలని కోరానని తెలిపారు. పలు రాష్ట్రాలలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పైగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఈ పథకం పరిదిలో నిధులు అందడం లేదు. ఇవన్నీ పక్కకు పెడితే ఇంతకూ గాంధీజి ఏం పాపం చేశారని ఆయన పేరు తీసేశారు? అని ప్రశ్నించారు.
పథకం పనితీరు మారాలి పేరు మారిస్తే సరా?: ప్రియాంక
ఈ పథకం పేరు మార్పు ఎందుకు జరిగిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని నిలదీశారు. పథకం పేరు మారిస్తే సరిపోతుందా? కార్యాలయాల్లో మార్పు తీసుకురావల్సి ఉందనారు. పథకం అసలు పేరు మారిస్తే ఒరిగేదేముంది? ఎందుకు ఇది చేశారని అడిగారు. గాంధీజి దేశానికి అత్యున్నత నేత, మహనీయుడి పేరు లేకుండా ఎందుకు చేశారనేది తెలియడం లేదని పార్లమెంట్ భవనం ఆవరణలో విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. గాంధీ హంతకులను పొగిడిన వారికి ఆయన పేరు లేకుండా చేయడం పెద్ద విషయం కాదని టిఎంసి ఎంపి డెరెక్ ఒ బ్రెయిన్ స్పందించారు. మహాత్మా గాంధీని ఇప్పుడు ప్రభుత్వం పనిగట్టుకుని అవమానించిందని అన్నారు. మొత్తానికి పథకం లేకుండా చేశారనే నిజాన్ని దాచిపెట్టేందుకే పేరు మార్పు వ్యవహారంతో ముందుకు వచ్చారని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ విమర్శించారు. పథకం దెబ్బతినడానికి కారణం రాష్ట్రాలే అని నిందలకు దిగుతారని, పైగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు నిధులు కోత పెడుతారని అన్నారు. పైగా పలు సాంకేతిక కారణాలు చూపి పని చేసిన కూలీలకు కూడా వేతనాలు రాకుండా చేశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు పార్లమెంట్ వెలుపల లోపలా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. లేబర్ కోడ్స్ పేరిట నిరంకుశ చట్టాలను తీసుకువచ్చారు. దీనితో కూలీల చేతికి దక్కాల్సిన పని , నోటికి చేరాల్సిన తిండి లేకుండా పోతోందని విమర్శించారు.