ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ జర్నీకి వచ్చే ఏడాది జనవరిలో 50 ఏళ్లు నిండనున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో ప్రత్యేక సంగీత కచేరి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో అక్షయపాత్ర ఫౌండేషన్ కూడా సిల్వర్ జూబ్లీ ఏడాదిలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఉమ్మడిగా వేడుకలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. జనవరి 10న బెంగళూరు మదవరలోని నైస్ మైదానంలో ‘ఇళయరాజా 50: ఎ లెజెండరీ మ్యూజికల్ జర్నీ’ పేరిట వేడుకలు నిర్వహించ తలపెట్టారు. పాఠశాల చిన్నారులకు మధ్యాహ్నం భోజనం, సంగీతంపై అవగాహన తదితర అంశాల మేళవింపుగా ‘మ్యూజిక్ ఫర్ మీల్స్’కు అక్షయ పాత్ర ఫౌండేషన్ చొరవ తీసుకుంటోంది. వేడుకల నిర్వహణకు అక్షయ పాత్ర ఫౌండేషన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందన్నారు. ఒక మంచి పని కోసం ఫౌండేషన్ చేసిన ప్రతిపాదన తనకు నచ్చిందని, వెంటనే మరో ఆలోచన లేకుండా ఒప్పకున్నట్లు ఇళయరాజా మీడియాతో తెలిపారు. గత ఐదు దశాబ్దాలుగా సంగీతం ప్రపంచం తనకు అన్నీ ఇచ్చిందని, ఇప్పుడు తిరిగి సమాజానికి ఇచ్చేందుకు తనకు ఈ సంగీత విభావరి మంచి అవకాశం అని పేర్కొన్నారు.