న్యూఢిల్లీ: 1960 ప్రాంతంలో హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాన్ని అమర్చడానికి నాటి ప్రధానులు, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అమెరికాకు అనుమతి కల్పించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు సోమవారం ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టారు. చైనా కార్యకలాపాలను పర్యవేక్షించడానికే ఇదంతా దశల వారీగా జరిగిందని వివరించారు. మొదట జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో 1964లో, తరువాత ఇందిరాగాంధీ కాలంలో 1967,1969లో జరిగిందన్నారు. అప్పటి అమెరికా ప్రభుత్వం తరువాత దీన్ని ఉపసంహరించుకోవడంతో ఆ ప్రమాదకరమైన పరికరాన్ని హిమాలయాల్లోనే విడిచిపెట్టేశారని పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగానది ఒడ్డున నివసిస్తోన్న ప్రజల్లో క్యాన్సర్ కేసులు పెరగడానికి, హిమానీ నదాలు కరిగిపోతుండడానికి, క్లౌడ్‌బరస్ట్, ఇళ్లల్లో పగుళ్లకు ఇదే కారణమా ? అని ప్రశ్నించారు. 1978 లో లోక్‌సభలో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఈ విషయాన్ని అంగీకరించారని, ఇటీవలనే న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించిందని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం ఈ ఆపరేషన్ కొనసాగడమే ఉత్తరభారతంలో ప్రకృతి వైపరీత్యాలకు కారణమని ఆరోపించారు. పరికరం నుంచి వెలువడే రేడియో ధార్మికత గురించి అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని, దర్యాప్తు జరిపి, బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని కోరారని ధుబే తన పోస్టులో పేర్కొన్నారు.