గ్రామీణుల కోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే అమలులో ఉన్న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం(ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) రద్దుకు కేంద్రం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. దాని స్థానంలో కొత్త చట్టం తీసుకు వచ్చే దిశగా చర్యలు ముమ్మరం చేసింది. సోమవారంనాడు లోక్‌సభలో మూడు కీలక బిల్లులతో పాటు ఉపాధి హామీ స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవక్ మిషన్(గ్రామీణ్)(విబిజి ఆర్‌ఎఎం జి)2025 పేరిట కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనప్పటికీ విపక్షాల తీవ్ర వ్యతిరేకత నడుమ వెనక్కి తగ్గింది. అయితే లోక్‌సభ సభ్యులకు నూతన బిల్లు ప్రతులను అందజేసినట్లు సమాచారం. ఈ శీతాకాల సమావేశాల్లోనే లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టి స్థాయి సంఘానికి పంపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. నూతన బిల్లు ప్రకారం రాష్ట్రాల ప్రభుత్వాలు పథకం అమలులో అత్యధిక భారాన్ని మోయాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచనున్నారు. వికసిత్ భారత్2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ్ బిల్లుకు రూపకల్పన చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల వేతనంతో కూడిన ఉపాధితో పాటు సంపన్న, సుస్థిర భారత్‌కు దారులు వేసేలా కొత్త చట్టంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపూ గ్రామీణ్ రోజ్‌గార్ యోజనగా కేంద్రం పేరు మార్చింది.