కామారెడ్డి: ఓడిన అభ్యర్థి కుటుంబంపై ట్రాక్టర్ తో ఢీకొట్టారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్ పేట గ్రామంలో జరిగింది. తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బిట్ల బాలరాజును ట్రాక్టర్ తో కాంగ్రెస్ అభ్యర్థి పాపయ్య సోదరుడు ఢీకొట్టాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, తనను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి మరి దాడి చేశాడు. తన అన్న కుమారుడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిబాబా అండతోనే ఈ దారుణానికి బాబాయి పాపయ్య సోదరుడు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఇంటి ముందు కూర్చున్న బిఆర్ఎస్ అభ్యర్థిని, అతని అనుచరులను, కుటుంబ సభ్యులను ట్రాక్టర్ తో కాంగ్రెస్ అభ్యర్థి ఢీకొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బిఆర్ఎస్ అభ్యర్థి, అతని అనుచరులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రెండు గంటలుగా రాస్తారోకో కొనసాగుతుంది. ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు.