వరంగల్: గుర్రం తన్నడంతో తీవ్రంగా గాయపడిన బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శివనగర్ పాడి మల్లారెడ్డినగర్‌కు చెందిన మిర్యాల గౌతమ్(12) బాబాయ్ నాగేంద్రతో కలిసి ఖిలా వరంగల్‌లోని ఏకశిల చిల్డ్రన్స్ పార్క్‌కు వచ్చాడు. పర్యాటకు సవారీ కోసం అక్కడ గుర్రాలు ఉన్నాయి. గుర్రాలపై సవారీ చేస్తుండగా బాలుడు వాటిని చూస్తున్నాడు. ఒక గుర్రం దగ్గర నిలబడ్డాడు. ఈ నెల 10న గుర్రం బాలుడిని తన్నడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించి ఐసియులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.