మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయబావుటా ఎగురవేశారు. మొదటి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జోష్ మీదున్న ఆ పార్టీ, రెండో విడతలోనూ విజయపరంపర కొనసాగించింది. 193 మండలాల్లో 3,911 గ్రామ పంచాయతీ సర్పంచి స్థానాలకు, 29,913 వార్డు స్థానాలకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. రాత్రి 11 గంటల వరకు ప్రకటించిన 3,867 సర్పంచి స్థానాలకు, 29,831 వార్డు స్థానాలకు రాష్ట్ర ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. అందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2,217 సర్పంచి స్థానాల్లో విజయం సాధించింది. బిఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు 1,180, బిజెపి మద్దతుదారులు 262 స్థానాల్లో గెలుపొందారు. 618 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. రెండో విడతలో మొత్తం 4,331 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, అందులో 415 స్థానాలు ఏకగ్రీవం కాగా, 5 స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దాంతో 3,911 సర్పంచి స్థానాలకు, 29,913 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలలో మొత్తం 12,832 మంది సర్పంచ్ అభ్యర్థులు, 71,070 మంది వార్డు మెంబర్ అభ్యర్థులు బరిలో నిలిచారు.
లాటరీలో వరించిన విజయం
మెదక్ మండలం చీపురుదుబ్బతండా గ్రామ సర్పంచి ఎన్నిక ఫలితం డ్రాలో తేలింది. చీపురుదుబ్బతండా పంచాయతీకి మోటు కాడి తండా, నైలి తండా అనుబంధంగా ఉన్నాయి. మొత్తం 3 తండాల్లో కలిపి 377 ఓట్లు ఉండగా, 367 ఓట్లు పోలయ్యాయి. అందులో కాంగ్రెస్ పార్టీ మద్దుతులో పోటీ చేసిన కేతావత్ సునీతకు 182, బిఆర్‌ఎస్ మద్దతులో పోటీ చేసిన బీమిలికి 182 ఓట్లు లభించాయి. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు. లాటరీలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతను అదృష్టం వరించింది. దీంతో ఆమె సర్పంచిగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
ఒక్క ఓటుతో విజయం
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ పంచాయతీ సర్పంచిగా ముత్యాల శ్రీవేద ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ పంచాయతీలో శ్రీవేద, స్వాతి ఇరువురు పోటీ పడగా 426 ఓట్లకు 378 ఓట్లు పోలయ్యాయి. ఇందులో శ్రీవేదకు 189, హర్షస్వాతికి 188 ఓట్లు రాగా ఒక్క ఓటు చెల్లలేదు. దీంతో శ్రీవేద ఒక్క ఓటు తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.
వార్డు సభ్యురాలే సర్పంచిగా గెలుపు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఉప్పుమడుగు సర్పంచిగా కొత్తకొండ రోజా 140 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గ్రామంలో ఆరో వార్డుకు నామినేషన్లు రాకపోవడంతో రోజా ఒక్కరే దాఖలు చేశారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో అటు వార్డు సభ్యురాలిగా, ఇటు సర్పంచి ఎన్నికై రోజా డబుల్ ధమామా సాధించారు. వార్డు సభ్యురాలి పదవికి రాజీనామా చేయనున్నారు.
సర్పంచిగా గెలిచిన మాజీ వార్డు సభ్యుడు
యాదాద్రి భువనగిరి జిల్లా కొండమగుడు గ్రామానికి ఇదివరకు వార్డు సభ్యులుగా సేవలందించిన కడెం పాండును ఈ ఎన్నికల్లో బిజెపి పార్టీ సర్పంచిగా బలపరచింది. 32 ఏళ్ల వయసు గల పాండు సర్పంచిగా గెలుపొందడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవతున్నాయి. కాగా, కొండమడుగు గ్రామంలో 12 వార్డులకు 6 వార్డులు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలువగా, 5 వార్డులు బిఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఒక్క వార్డు కూడా గెలువకుండా కడెం పాండు సర్పంచిగా గెలుపొందడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఓటేసిన పలువురు ప్రజాప్రతినిధులు చేగుంట మండలం రుక్మాపూర్‌లో ప్రశాంత్‌రెడ్డి అనే వ్యక్తి సింగపూర్ నుంచి వచ్చి ఓటేశారు. సిద్దిపేట జిల్లా పోతారంలో దుబ్బాక ఎంఎల్‌ఎ కొత్త ప్రభాకర్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బొప్పాపూర్‌లో మెదక్ ఎంపి మాధవనేని రఘునందన్‌రావు దంపతులు ఓటు వేశారు. భూంపల్లిలో రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట సిపి విజయ్ కుమార్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
85.86 శాతం పోలింగ్
రెండో విడత పల్లెపోరు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తమ గ్రామ పరిపాలకులను ఎన్నుకునేందుకు ఉత్సాహంగా ఓటేశారు.రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 85.86 శాతం పోలింగ్ నమోదైంది. అందులో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72 శాతం పోలింగ్ నమోదు కాగా, నిజామాబాద్ జిల్లాలో 76.71 శాతం, జగిత్యాలలో 78.34 శాతం, భదాద్రి కొత్తగూడెంలో 82.65 శాతం నమోదైంది. అలాగే నిర్మల్‌లో 82.67 శాతం, వికారాబాద్‌లో 82.72 శాతం, ములుగులో 82.93 శాతం, నాగర్‌కర్నూల్‌లో 83.98 శాతం, పెద్దపలిలో 84.15 శాతం, నారాయణపేటలో 84.33 శాతం, రాజన్న సిరిసిల్లలో 84.41 శాతం, మంచిర్యాలలో 84.59 శాతం, మహబూబాబాద్‌లో 85.05 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 85.25 శాతం, రంగారెడ్డిలో 85.30 శాతం, కామారెడ్డిలో 86.08 శాతం, కరీంనగర్‌లో 86.58 శాతం, మహబూబ్‌నగర్‌లో 86.62 శాతం, కొమురం భీం అసిఫాబాద్‌లో 86.63 శాతం, అదిలాబాద్‌లో 86.68 శాతం, సంగారెడ్డిలో 86.96 శాతం, వనపర్తిలో 87.05 శాతం, జోగులాండ గద్వాల్‌లో 87.08 శాతం, హన్మకొండలో 87.34 శాతం, వరంగల్‌లో 88.11 శాతం, సిద్దిపేటలో 88.36 శాతం, జనగాంలో 88.82 శాతం, నల్గొండలో 88.52 శాతం, మెదక్‌లో 88.74 శాతం, సూర్యాపేటలో 88.80 శాతం, ఖమ్మంలో 91.21 శాతం పోలింగ్ నమోదైంది.