తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె కావడం వల్లే నాయకురాలు అయ్యారని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి అన్నారు. తనది ఎప్పుడైనా డైరెక్ట్ ఫైట్ ఉంటుందని కాగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్ రావు వెనుక నుంచి పొడుస్తారని జగ్గా రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. తాను, హరీష్ రావు ఇద్దరమూ రాజకీయ శతృవులమే అయినా పని విషయంలో ఇద్దరమూ పని పురుగులం అని ఆయన తెలిపారు. సంగారెడ్డిలో తాను రాహుల్ గాంధీ సభ నిర్వహించినప్పుడు హరీష్ రావును కెసిఆర్ తిట్టినట్లు తనకు సమాచారం ఉందన్నారు.
దీంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తనను ఓడించేందుకు హరీష్ రావు తీవ్రంగా ప్రయత్నించారని ఆయన చెప్పారు. హరీష్ రావుపై కోపంతోనే తాను బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరానని కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావిస్తూ మీ మధ్య ఉన్న పంచాయితీలోకి తనను ఎందుకు లాగుతారని ప్రశ్నించారు. తాను పార్టీ మారడానికి హరీష్ రావుకు సంబంధం లేదన్నారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు తాను కాంగ్రెస్‌లో చేరానని జగ్గారెడ్డి చెప్పారు. కెసిఆర్, చంద్రబాబు నాయుడు కూడా గతంలో కాంగ్రెస్‌లో నాయకులేనని ఆయన తెలిపారు.
నేను డిస్ట్రబ్ అయ్యాను..
పార్టీలో తాను ఒక విషయంలో డిస్ట్రబ్ అయ్యానని ఆయన బాధను వ్యక్తం చేశారు. అదేమిటని విలేకరులు పదేపదే ప్రశ్నించినా, ఆయన చెప్పకుండా దాట వేశారు. సమయం వచ్చినప్పుడు చెబుతానని అన్నారు. ఆ సమయం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించగా, వచ్చే ఏడాది మేలో చెబుతానని ఆయన సమాధానమిచ్చారు.