ఓటు చోరీ అనేది బీజేపీ డిఎన్ ఏలోనే ఉందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారంనాడు ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో నరేంద్రమోదీ -ఆర్ ఎస్ ఎస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగిస్తామని కాంగ్రెస్ ప్రతిజ్ఞ చేసినట్లు వెల్లడించారు. రామ్ లీలా మైదానంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఓట్ చోర్ గద్దీ ఛోడ్ అనే ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రెసిడెంట్ సోనియాగాంధీ , పలువురు నాయకులు హాజరైన సమావేశానికి హాజరైన వేలాది మంది ఓట్ చోరీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా లోక్ సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పేర్లను ప్రస్తావించి వారు బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సత్యాన్నే నమ్ముకున్నదని, సత్యమే ఆయుధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని స్పష్టం చేశారు. మోదీ అండ్ కో కు అధికారం ఉందని, అందుకే వారు ఓట్ చోరీలో మునిగి పోయారని ఆయన ఆరోపించారు.
మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలో ఓట్ల చోరీ పెచ్చుపెరిగి పోయింది, కానీ, చివరికి సత్యానికే జయం. సత్యం, అహింస ఆయుధంగా కాంగ్రెస్ బీజేపీ -ఆర్ ఎస్‌ఎస్ సర్కార్ ను ఇంటిదారి పట్టిస్తాం అని మాజీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ అన్నారు.ఓటు చోరీకి వ్యతిరేకంగా దేశం మారు మూల ప్రాంతాలనుంచి ఆరు లక్షల సంతకాలను కాంగ్రెస్ పార్టీ సేకరించిందని, వాటిని రాష్ట్రపతికి అందజేస్తారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.ఓట్ల చోరీ, డబ్బుచోరీ, భూమి చోరీ,శ్(కబ్జాలు), (స్వతంత్ర ప్రతిపత్తిగల) సంస్థల చోరీ, ఉపాధి చోరీ, హక్కుల చోరీ, ఎన్నికల చోరీ ప్రజల చోరీ ఇలాంటి చోరీలే బీజేపీ అధికారంలోకి రావడానికి నిచ్చెన అయ్యాయని రాహుల్ గాంధీ ఆవేశంగా అన్నారు.అండమాన్ నికోబార్ దీవులలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, ప్రపంచం సత్యాన్ని చూడదు. అధికారాన్ని చూస్తుంది. అధికారంలో ఉన్నవారినే గౌరవిస్తుందని ఆని దుయ్యబట్టారు.
బీహార్ ఎన్నికల సమయంలో బీజేపీ రూ. 10,000 ఇవ్వడాన్ని, ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని, వారిపై ఎలాంటి చర్య తీసుకోలేదని గాంధీ ఆరోపించారు. బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కయిందని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్ పై ఎలాంటి చర్యలకు అవకాశం లేకుండా బీజేపీ సర్కార్ ఓ చట్టం చేసిందని, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని మార్చి, ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని, దీనికి కొంత సమయం పట్టవచ్చు కానీ, సత్యమే జయిస్తుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు.దేశంలో ఓట్ల దొంగతనం ఎలా జరుగుతుందో, ఎలా దొంగఓట్లను జోడిస్తూ, అసలైన ఓటర్లను తొలగిస్తున్నారో తాము రుజువులుతో సహా చూపామని, అయినా ఎన్నికలకమిషన్ తమకు సమాధానం ఇవ్వలేదని ఆయన ప్రజలకు వివరించారు. మోదీ సర్కార్ చిన్న వ్యాపారులను నాశనం చేసిందని, తప్పుడు జీఎస్టీ అమలు చేసిందని, నిరుద్యోగం, కాలుష్యం వంటి సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు.