మెదక్ జిల్లా, చేగుంట మండలం, గొల్లపల్లి గ్రామంలో జరుగుతున్న రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో నిలిచిన సర్పంచ్ అభ్యర్థి చేర్యాల సబిత భర్త జనార్ధన్ రెడ్డి శనివారం రాత్రి ప్రచారం నిర్వహించి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు వస్తున్నారనే భయంతో ఇంటికి రాకుండా అదృశ్య మయ్యాడు. జనార్ధన్‌రెడ్డి కనబడకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. డిఎస్‌పి, సిఐ, ఎస్‌ఐ, సిబ్బందితో గ్రామ శివారులో డాగ్ స్కాడ్, డ్రోన్ కెమెరాతో వెతికినా కనబడలేదు. అయితే, ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు పొలాల్లో పరుగెత్తుకుంటూ కనబడడంతో పోలీసులు అతనిని పట్టుకున్నారు. తమ విచారణలో అన్ని బయటకు వస్తాయని డిఎస్‌పి తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ చేపడతామని తెలిపారు.
ఎన్నికల్లో ఓడిపోతానని డ్రామా..ప్రత్యర్థుల ఆరోపణ
గొల్లపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో పలువురు పోటీ చేస్తుండగా చేర్యాల సబిత భర్త జనార్ధన్‌రెడ్డి కావాలనే డ్రామా ఆడి, ఆదివారం ఉదయం వరకు కనబడకుండాపోయి 70 శాతం పోలింగ్ అయిన తరువాత బయటకు వచ్చాడని అతని ప్రత్యర్థులు ఆరోపించారు. కేవలం సానుభూతితో గెలవాలనే ఉద్దేశంతో ఈ డ్రామా ఆడాడని, గ్రామంలో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని అధికారులను డిమాండ్ చేశారు.