బిఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు&బిజెపికి అధికారం రాదు..” అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఓట్ చోర్ .. గద్దీ చోడ్ పేరిట ఢిల్లీలోని రాం లీలా మైదానంలో ఏఐసిసి చేపట్టిన మహా ధర్నాలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ మంత్రివర్గ ప్రక్షాళన అంశాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. తనకు మంత్రివర్గంలో చేరేందుకు ఛాన్స్ లేదన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల ఎంపికలో బిసిలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చామని ఆయన తెలిపారు. వ్యూచర్ సిటీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారని ఆయన చెప్పారు. అప్పుడు హైదరాబాద్‌తో పోటీ పడేందుకు ఎవరికీ సాద్యం కాదన్నారు.
ప్రజల్లో బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఉన్నంత అభిమానం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు లేదన్నారు. బిఆర్‌ఎస్ పదేళ్ళు అధికారంలో ఉండి చేయలేని అభివృద్ధిని తమ ప్రభుత్వం రెండేళ్ళలో చేశామని ఆయన వివరించారు.ఓట్ చోర్ గద్దీ చోడ్ పేరిట తమ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ప్రజా ఉద్యమంతో దేశ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మహా ధర్నాతో కేంద్రానికి ‘సెగ’ తగులుతుందని భావిస్తున్నానని ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా చేపట్టిన సంతకాల సేకరణతో ఐదున్నర కోట్ల మంది ముందుకు వచ్చి సంతకాలు చేశారని ఆయన తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కేంద్రం తమ జేబు సంస్థగా భావిస్తున్నదని మహేష్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు.