హైదరాబాద్: రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బిజెపి చూస్తోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఓటు హక్కు నుంచి పేదలను దూరం చేస్తున్నారని, ఓట్ చోరీ సమస్య కాంగ్రెస్ దే కాదని.. దేశానిది అని.. చెప్పారు. ఓట్ చోరీ అవకతవకలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఢిల్లీ రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ నేతలు మహాధర్నాచేశారు. ‘ఓట్ చోర్- గద్దీ ఛోడ్’ పేరుతో కాంగ్రెస్ పార్టీ మహార్యాలీ నిర్వహించారు. ధర్నాలో సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ఉంటేనే.. రిజర్వేషన్లు వంటి అవకాశాలు ఉంటాయని, ఓట్ చోరీ, ఎస్ఐఆర్ ద్వారా అక్రమంగా గెలవాలని బిజెపి చూస్తోందని రేవంత్ మండిపడ్డారు. ఓటు తొలగిస్తే రేషన్ కార్డు, భూమి సహా అన్నీ కోల్పోతారని, ఓటు చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాడుతున్నారని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ రాహుల్ కు మద్దతుగా నిలబడాలని, రాజ్యాంగాన్ని మార్చడంతో పాటు రిజర్వేషన్లు తొలగిస్తారనే.. గత ఎన్నికల్లో ఎన్ డిఎకి ప్రజలు 400 సీట్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చే అవకాశం రాలేదనే ఓట్లు తొలగిస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.