మంచిప్ప గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత
నిజామాబాద్: దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పనిచేసే ఓ సిఆర్ పిఎఫ్ జవానుకు సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం దక్కలేదు. నిజామాబాద్ జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంచిప్ప గ్రామానికి చెందిన జవాన్ ప్రవీణ్ ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం ఎన్నికల అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పోలింగ్ రోజున తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రవీణ్ ప్రత్యేకంగా గ్రామానికి వచ్చారు. తీరా పోలింగ్ కేంద్రానికి వెళ్లగా అక్కడి అధికారులు చెప్పిన మాట విని ఆయన కంగుతిన్నారు. “మీ ఓటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇప్పటికే రాజమండ్రికి పంపబడింది” అని అధికారులు తేల్చి చెప్పారు. అధికారుల నిర్వాకంతో తీవ్ర ఆవేదనకు గురైన జవాన్ ప్రవీణ్ అక్కడే నిరసనకు దిగారు. దేశ సేవలో ఉన్న తన ఓటును, తన అనుమతి లేకుండా మరొక ప్రాంతానికి ఎలా కేటాయిస్తారంటూ అధికారులను నిలదీశారు. తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెంటనే అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అన్యాయంపై ఉన్నతాధికారుల జోక్యం కోరుతూ, ప్రవీణ్ వెంటనే జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. దేశ భక్తుడైన తనకు ఓటు వేసే అవకాశం కల్పించాలని, ఇందుకోసం అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన అభ్యర్థించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల అమలులో జరిగిన ఈ ఘోర తప్పిదంపై విచారణ జరిపి, తక్షణమే న్యాయం చేయాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి.