హైదరాబాద్: ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే , రాజ్యాంగం విలువలు కొనసాగాలంటే ప్రశాంతంగా న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కానీ ఎన్నికల కమిషన్ ను తమ తాబేదారిగా మార్చుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వారికి వ్యతిరేకంగా ఓటు వేసేవారీ ఓటు తొలగించడంతో పాటు ఓటు చోరికి పాల్పడుతున్న పరిస్థితిని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పడంతో జరిగిన విధానాన్ని కూడా లైవ్ లో చూపించారన్నారు. దేశ వ్యాప్తంగా ఓటు చోరికి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాలతో ఆదివారం ఢిల్లీలో ర్యాలీ జరుగుతున్న సందర్భంగా పొన్నం సోషల్ మీడియాతో ఖాతాలో వీడియోను పోస్టు చేశారు. ఈ ర్యాలీకి అందరం వెళ్తున్నామని, ఇప్పటికైన ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక వాదులంతా ఇటువంటి అప్రజాస్వామిక చర్యలు ఖండించాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఓటు చోరీ పై లక్షలాది సంతకాల సేకరణ చేసి ఢిల్లీలోని ఎఐసిసి ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు అందించడం జరుగుతుందని వివరించారు. రాజ్యాంగాన్ని ,ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ అన్నివేళలా కంకణం కట్టుకొని ఉంటుందని చెప్పారు.