న్యూఢిల్లీ : కాల ప్రభావం విపరీత పరిణామానికి దారితీసింది. నూనూగు మీసాల ప్రాయానికి ముందే , స్కూల్ దశలోనే పిల్లలు ఎక్కువగానే డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. పలు నగరాలపై జరిపిన ఢిల్లీలోని ఎయిమ్స్ పరిశోధక బృందం సర్వే జరిపింది. ఇందులో 10 నగరాలలో ఈ వైపరీత్య లక్షణాలు కనుగొన్నారు. సగటున చూస్తే మత్తుకు అలవాటుపడుతున్న వయస్సు దాదాపు 13 సంవత్సరాలుగా నిర్థారణ అయింది. స్కూల్‌కు వెళ్లే పిల్లలు ఏం చేస్తున్నారనేది నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఇప్పటి అధ్యయన క్రమంలో వెల్లడైంది. ప్రాధమిక విద్యాభ్యాసం దశలోనే విద్యార్థుల చెడు అలవాట్లపై చెక్ అవసరం ఉందని, దీనికి అనుగుణంగా వారిని దీని నుంచి దూరంగా ఉంచేందుకు చొరవ తీసుకోవచ్చునని పరిశోధక బృందం అభిప్రాయపడింది.
స్కూల్ తొలి దశలో అలవాటు అయిన డ్రగ్స్ మత్తుమందు వాడకం ఇతర అలవాట్లు వారు క్రమేపీ ఉన్నత విద్య స్థాయికి అంటే తొమ్మిది పదవ తరగతికి వెళ్లేసరికి పతాక స్థాయికి చేరుతోంది. ఏడు ఎనిమిది క్లాసులతో పోలిస్తే ఆ తరువాతి తరగతుల దశలో వీరి చెడు అలవాటు చక్కదిద్దుకోలేని స్థితికి చేరుతోంది. వరుసగా 8, 9, 10,11 తరగతులకు చెందిన దాదాపు ఆరువేల మంది విద్యార్థుల పరిస్థితిని నమూనాగా తీసుకుని అధ్యయనం నిర్వహించారు. బెంగళూరు. హైదరాబాద్, ఢిల్లీ, దిబ్రూగఢ్, చండీగఢ్, ఇంఫాల్, జమ్మూ కశ్మీర్ , లక్నో, ముంబై వంటి పది నగరాలలో సర్వే జరిగింది. ఈ సర్వే జరిగింది కూడా 2018 నుంచి 2019 మధ్యకాలంలోనే . అయితే ఈ మధ్య కాలంలో విపరీత స్థాయి సామాజిక పరిణామాలతో పిల్లల్లో ఈ చెడువ్యసనం ఎన్ని స్థాయిల్లో పెరిగిందనేది కీలక ఆందోళనకర విషయం అయింది.