భోపాల్ ః మధ్యప్రదేశ్లోని భోపాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజు సింగ్ చౌహాన్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. శనివారం జరిగిన ఈ పరిణామంపై పలు రకాల వార్తలు వెలువడ్డాయి. అయితే ఇది అడపాదడపా జరిగే భద్రతా సమీక్షనే అని శనివారం బిజెపి వర్గాలు తెలిపాయి. ప్రత్యేకత ఏమీ లేదని వివరించారు. అయితే ఇక్కడి రద్దీ ప్రాంతం లింక్రోడ్లోని ఆయన నివాసం వెలుపల ఉన్నట్లుండి ఉదయమే తాత్కాలిక భద్రతా సిబ్బంది గుడారం వెలిసింది. ఈ ప్రాంతంలోకి అదనపు పోలీసు దళాలను తరలించారు.
శుక్రవారం రాత్రి చౌహాన్ ఈ నివాసంలోనే గడిపారు. శనివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. అయితే ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కొనసాగాయి. అయితే త్వరలోనే చౌహాన్ బిజెపి జాతీయ అధ్యక్షులు అవుతారని వార్తలు వెలువడుతున్నాయి. అందుకే ఈ మాజీ సిఎం నివాసం వద్ద భద్రతను పెంచినట్లు ప్రచారం జరిగింది. ఇక్కడ భద్రత పెంపుపై రాష్ట్ర కాంగ్రెస్ నేత ముఖేష్ నాయక్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇందుకు సిఎం మోహన్ యాదవ్ ప్రభుత్వం సమాధానం ఇచ్చుకోవాలని కోరారు.