మొదటి విడతలో నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఔరవాణి గ్రామపంచాయతీలో పోలీంగ్ జరిగింది. ఈ గ్రామపంచాయతీలో మొత్తం 1577 ఓట్లున్నాయి. సర్పంచ్ బరిలో మొత్తం నలుగురు అభ్యర్థులు నిల్చున్నారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి జక్కల పరమేష్ విజయం సాధించాడు. ఇండిపెండెంట్ అభ్యర్థి బాలరాజ్ గౌడ్ ఎన్నికల్లో రూ. 10 లక్షలపైగా ఖర్చు పెట్టాడు. అయినా ఓడి పోయాడు. దీంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని బాలరాజ్ గౌడ్ ఇంటింటికి దేవుడు చిత్రం పటం పట్టుకొని అడుగుతున్నాడు. డబ్బులు తీసుకొని ఓటు వేయని వారు తమ డబ్బులు తిరిగివ్వాలని వేడుకుంటున్నారు. అప్పు చేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టామని తమ డబ్బులు తమకు ఇవ్వాలని బాలరాజ్ గౌడ్ భార్య చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకొని గ్రామస్థులను వేడుకుంటున్నారు. అయితే ఓట్లు వేశామంటూ పలువురు దేవుడిపై ప్రమాణం చేశారు. అందరూ ఓట్లు వేస్తే ఎలా ఓడిపోయానని బాలరాజ్ గౌడ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.