బ్లాక్ బస్టర్ ఓజి మూవీ తర్వాత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నుంచి రాబోతున్న మరో క్రేజీ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అయితే, ఇది కూడా రిమేక్ మూవీనే అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో పవన్ మళ్లీ రిమేక్ మూవీలో నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. శనివారం ఈమూవీలోని ‘దేఖ్‌లేంగే’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఈ సాంగ్ ను అభిమానుల చేత లాంచ్ చేయించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ అభిమానులను అలరిస్తోంది. చాలా రోజుల తర్వాత పవన్ తనదైన స్టెప్పులతో డ్యాన్స్ వేసి వావ్ అనిపించారు.
ఈ సాంగ్ లాంచ్ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ గురించి కీలక విషయాలను పంచుకున్నారు. ఈ మూవీ రిమేక్ కాదని.. కొత్త కథతోనే రూపొందించినట్లు తెలిపారు. అలాగే, ఈ సినిమా ఆలస్యానికి పవన్ కారణం కాదని చెప్పారు. మొదట లవ్‌స్టోరీ చేద్దామనుకుని.. దాని మీద వర్క్ చేశామన్నారు. అయితే, అది కుదరలేదని చెప్పారు. తర్వాత రీమేక్ మూవీనే చేయాలనుకున్నామని.. అది కూడా సాధ్యపడలేదన్నారు. దీంతో అభిమానులతో పాటు అందరినీ అలరించేలా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ కథ రాసుకున్నట్లు హరీశ్ శంకర్ స్పష్టం చేశారు. కాగా, ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల, రాశీ కన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.