భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు టి-20ల సిరీస్ ప్రస్తుతం 1-1గా సమంగా ఉంది. ధర్మశాల వేదికగా జరిగే మూడో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని, రెండో టి-20లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే రెండో టి-20లో భారత్ చిత్తుగా ఓడిపోవడానికి బ్యాటింగ్‌లో వైఫల్యం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో మూడో టి-20 కోసం జట్టులో కీలక మార్పులు చేసేందుకు మేనేజ్‌మెంట్ వ్యూహాలు రచిస్తోంది.
తొలి రెండు టి-20ల్లో ఘోరంగా విఫలమైన వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌పై వేటు పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడి స్థానంలో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని అనుకుంటున్నారట. గాయం నుంచి కోలుకున్న గిల్ రీ ఎంట్రీ ఇవ్వడంతో సంజూ ఏకంగా జట్టులో స్థానం కోల్పోయాడు. కానీ, గిల్ రెండు మ్యాచుల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో సంజూని తప్పించినందుకు మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూడో టి-20కి సంజూని తిరిగి జట్టులోకి తీసుకొని విమర్శలకు చెక్ పెట్టాలని కోచ్ గంభీర్, మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మూడో టి20కి భారత తుది జట్టు(అంచనా)
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.